Telangana: తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నా... ఆసుపత్రుల్లో డాక్టర్ల కొరత!

Doctors Scarecity in Telangana Hospitals

  • 50 నుంచి 60 శాతం తక్కువగా డాక్టర్లు
  • పలు ఆసుపత్రుల్లో ఎన్నో ఖాళీలు
  • కేసుల సంఖ్య పెరిగితే చికిత్సకు అవరోధం

తెలంగాణలో కరోనా కేసులు నానాటికీ పెరిగిపోతున్న వేళ, జిల్లా ఆసుపత్రుల్లో వైద్యుల కొరత ఆందోళన కలిగిస్తోంది. కరోనా వైరస్ సోకిన వారికి ట్రీట్ మెంట్ చేసేందుకు 9 జిల్లా ఆసుపత్రులు సిద్ధంగా ఉన్నా, అక్కడ ఉండాల్సిన సంఖ్యలో వైద్యులు అందుబాటులో లేరు. 50 నుంచి 60 శాతం వరకూ డాక్టర్ల కొరత ఉందని వైద్యాధికారులు అంటున్నారు. నిజామాబాద్ లోని ప్రభుత్వ ఆసుపత్రి, ఆదిలాబాద్ లోని రిమ్స్, వరంగల్ లోని ఎంజీఎంలతో పాటు కరీంనగర్, నల్గొండ, మహబూబ్ నగర్, సిద్ధిపేట, ఖమ్మం, సూర్యాపేట జిల్లా ఆసుపత్రులు కొవిడ్-19 చికిత్సలకు సిద్ధమయ్యాయి.

కాగా, నిజామాబాద్ ఆసుపత్రిలో 200 బెడ్లను కరోనా రోగులకు కేటాయించారు. ఇక్కడ 304 మంది వైద్యులు పనిచేయాల్సి వుండగా, ప్రస్తుతం 104 మంది మాత్రమే విధుల్లో ఉన్నారు. రిమ్స్ లో కరోనా రోగుల కోసం 100 బెడ్లు ఉండగా, ప్రస్తుతం 9 మందికే చికిత్స జరుగుతోంది. ఇక్కడ కేవలం ఐదుగురు సీనియర్ డాక్టర్లు మాత్రమే ఉన్నారు. కేసుల సంఖ్య పెరిగితే, వీరు ఎట్టి పరిస్థితుల్లోనూ సరిపోరనే చెప్పచ్చు.

ఖమ్మం జీజీహెచ్ విషయానికి వస్తే, 100 బెడ్లు కరోనా రోగుల కోసం ఉండగా, 50 శాతం డాక్టర్ల షార్టేజ్ నెలకొని వుంది. కేవలం 8 వెంటిలేటర్లు మాత్రమే ఉన్నాయి. వరంగల్ ఎంజీఎంలో 200 బెడ్లకు గాను ప్రస్తుతం 10 మంది చికిత్స పొందుతున్నారు. మొత్తం 1,420 మెడికల్ ఆఫీసర్ పోస్టులు ఉండగా, ప్రస్తుతం 870 మంది మాత్రమే పనిచేస్తున్నారు. నల్గొండ జీజీహెచ్ లో 25 సాధారణ, 10 ఐసీయూ బెడ్లను వైద్యాధికారులు సిద్ధం చేశారు.

సూర్యాపేట, సిద్ధిపేట జిల్లాల్లో ఇప్పటికీ జిల్లా ఆసుపత్రుల్లో వైద్యులకు పూర్తి స్థాయిలో డ్యూటీలు ఇవ్వలేదు. మహబూబ్ నగర్ ప్రభుత్వాసుపత్రిలో 111 మంది పనిచేయాల్సి వుండగా, ప్రస్తుతం 26 మంది మాత్రమే ఉన్నారు. కాగా, ఈ ఆసుపత్రుల్లో లెవల్ 1, లెవల్ 2 కరోనా పేషంట్లకు మాత్రమే చికిత్స చేసే వీలుంది. పరిస్థితి విషమించి, వెంటిలేటర్ సపోర్ట్ అవసరమైతే, ఇక్కడి వారు చేతులెత్తేసి, హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి రిఫర్ చేయాల్సిందే.

  • Loading...

More Telugu News