Kim Jong Un: సంబంధాలు తెంచుకునే సమయం... సైన్యానికి బాధ్యతలు: కిమ్ జాంగ్ ఉన్ సంచలన వ్యాఖ్యలు

North Korea warning to South Korea

  • దక్షిణ కొరియాపై కఠిన చర్యలు తీసుకుంటాం
  • అనుసంధాన కార్యాలయం నేలమట్టం చేయనున్నాం
  • విధ్వంస దృశ్యాలు త్వరలోనే చూడబోతున్నారన్న కిమ్ యో జాంగ్

దక్షిణ కొరియాతో తమ సంబంధాలు తెంచుకునే సమయం వచ్చేసిందని వర్కర్స్‌ పార్టీ ఆఫ్‌ కొరియా ప్రత్యామ్నాయ పొలిట్‌ సభ్యురాలు,  నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ సోదరి కిమ్‌ యో జాంగ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమకు దాయాది దేశమైన దక్షిణ కొరియాపై కఠిన చర్యలు తీసుకోనున్నామని, ఈ మేరకు సైన్యానికి అధికారాలు అప్పగించామని శనివారం నాడు ఆమె అన్నారు. సుప్రీం లీడర్ కిమ్ జాంగ్ ఉన్‌, తమ పార్టీ, ప్రభుత్వం తనకిచ్చిన అధికారాన్ని అనుసరించి, శత్రు దేశంపై తదుపరి చర్యకు సిద్ధమవ్వాల్సిందిగా సైన్యాధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు ఆమె పేర్కొన్నారు.

దక్షిణ కొరియాతో తమకున్న కొద్దిపాటి సంబంధాలను తెగదెంపులు చేసుకోవడానికి ఇదే సరైన సమయమని భావిస్తున్నట్టు ఆమె తెలిపారు. రెండు దేశాల మధ్యా పనికిరాని సంబంధాలకు వేదికగా నిలిచిన అనుసంధాన కార్యాలయం నేలమట్టం అయ్యే క్షణాలు త్వరలో రానున్నాయని, అది విధ్వంసమయ్యే దృశ్యాలను త్వరలోనే చూడబోతున్నారని ఆమె అన్నారు. కిమ్ యో జాంగ్ వ్యాఖ్యలను ఉత్తర కొరియా అధికార మీడియా సైతం ధ్రువీకరించింది.

గత కొంతకాలంగా ఇరు దేశాల మధ్యా నెలకొన్న విబేధాలు తారాస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. కిమ్‌ జోంగ్‌ ఉన్‌ నియంతృత్వ ధోరణిని నిరసిస్తూ, సరిహద్దుల్లో బెలూన్లను దక్షిణ కొరియా వాసులు ఎగురవేయగా, కిమ్ సర్కారు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఇదే సమయంలో కిమ్‌ గురించి విమర్శనాత్మక రాతలు రాసిన కరపత్రాలు కూడా గాల్లో కనిపించాయి. ఈ ఘటనలపై కిమ్‌ యో జాంగ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ, రెండు దేశాల మధ్యా కుదిరిన మిలిటరీ ఒప్పందం నుంచి తప్పుకొంటామని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారన్న సంగతి తెలిసిందే.

Kim Jong Un
Kim Yo John
South Korea
North Korea
  • Loading...

More Telugu News