Corona Virus: ఆందోళనకరం.. మళ్లీ కరోనా కోరల్లో చిక్కుకుంటున్న తెలంగాణ జిల్లాలు!

All Telangana districts back in coronavirus grip

  • 20 జిల్లాల్లో కొన్ని వారాల పాటు నమోదు కాని కేసులు
  • అన్ని జిల్లాల్లో ఇప్పుడు కొత్తగా నమోదవుతున్న కేసులు
  • కట్టడి చేశామనుకున్న వైరస్ మళ్లీ పడగలు విప్పుతున్న వైనం

తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. అన్ని జిల్లాలకు తన కొమ్ములను విస్తరిస్తోంది. నిన్న ఒక్కరోజులో రాష్ట్రంలో 209 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సరిగ్గా నెల క్రితం కేసుల నమోదు సంఖ్య చాలా తక్కువగానే ఉంది. ఆ కేసులు కూడా దాదాపు జీహెచ్ఎంసీ, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోనే నమోదయ్యేవి. కొన్ని వారాల పాటు దాదాపు 20 జిల్లాల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. దీంతో అందరూ చాలా సంతోషపడ్డారు. కానీ, ఆ ఆనందం ఇప్పుడు ఆవిరవుతోంది. అన్ని జిల్లాల్లో ఇప్పుడు మళ్లీ కేసులు నమోదవుతున్నాయి.

భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, గద్వాల్ జిల్లాల్లో చివరి వారం వరకు కూడా కరోనా కేసులు నమోదు కాలేదు. కానీ, ఇప్పుడు ఈ జిల్లాల్లో కూడా కేసులు రావడంతో అధికారులు ఉలిక్కిపడ్డారు.

తెలంగాణలో నిన్నటి వరకు మొత్తం 4,320 కేసులు నమోదయ్యాయి. 165 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో 1,993 మంది పేషెంట్లు కోలుకుని డిశ్చార్జి కాగా... ఇంకా 2,162 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

నిన్న నమోదైన వాటిల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 175 కేసులు నమోదు కాగా... మిగిలిన కేసులు మహబూబ్ నగర్, వరంగల్ అర్బన్, రంగారెడ్డి, మేడ్చల్, ములుగు, ఆసిఫాబాద్, కామారెడ్డి, సిద్దిపేట, వరంగల్ రూరల్, సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల్లో నమోదయ్యాయి. పలు జిల్లాల్లో మళ్లీ కొత్త కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కట్టడి చేశామనుకున్న వైరస్ మళ్లీ పడగలు విప్పుతోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

  • Loading...

More Telugu News