Corona Virus: కరోనా వైరస్ లో నిదానంగా ఉత్పరివర్తనం... వ్యాక్సిన్ల పాలిట అదే వరం!
- కరోనా 24 సార్లు ఉత్పరివర్తనం చెందుతున్నట్టు గుర్తించిన పరిశోధకులు
- యూరప్, అమెరికాలోని కరోనాకు, చైనాలోని కరోనాకు పోలికలు
- ఈ లక్షణం వల్ల వ్యాక్సిన్లు వెంటనే వైరస్ ను గుర్తించగలవని వెల్లడి
కొన్ని డీఎన్ఏ ఆధారిత వైరస్ లు క్షణానికో రూపుదాల్చుతూ శాస్త్రవేత్తలకు సైతం కొరకరాని కొయ్యల్లా పరిణమిస్తుంటాయి. అయితే, ప్రస్తుతం ప్రపంచ మానవాళికి సవాల్ విసురుతున్న ఆర్ఎన్ఏ ఆధారిత కరోనా వైరస్ లో మాత్రం ఉత్పరివర్తనం ఎంతో నిదానంగా జరుగుతోందని, వైరస్ రూపాంతరం చెందే వేగం చాలా తక్కువగా ఉందని పరిశోధకులు గుర్తించారు. ఈ అంశం వ్యాక్సిన్ల రూపకల్పనలో విశేషంగా లాభిస్తుందని ఓ అధ్యయనం చెబుతోంది.
శ్వాస వ్యవస్థలపై ప్రభావం చూపే ఇతర వైరస్ లతో పోల్చితే కరోనా వైరస్ కణాలు ఉత్పరివర్తనం చెందడం చాలా తక్కువని పరిశోధకులు తెలిపారు. ఈ కారణంగానే, వ్యాక్సిన్లు మానవ శరీరంలో ప్రవేశించే కరోనా వైరస్ ను వెంటనే గుర్తించగలవని వివరించారు. సింగిల్ డోసు వ్యాక్సిన్ తో 24 రకాల కరోనా వైరస్ పోచలను కూడా నిరోధించవచ్చని అధ్యయనంలో వెల్లడించారు.
ఇది కేవలం 24 సార్లు ఉత్పర్తివర్తనం చెందినట్టు గుర్తించామని, అందుకే యూరప్, అమెరికాపై దాడి చేసిన కరోనా వైరస్ పోచలకు, వుహాన్ లో ఉద్భవించిన తొలి కరోనా వైరస్ పోచలకు పోలికలు అచ్చుగుద్దినట్టు సరిపోయాయని పేర్కొన్నారు. ఉత్పరివర్తనం చెందే శాతం తక్కువ కావడం వల్ల కరోనా వైరస్ లో స్వల్ప మార్పులు తప్ప పూర్తిగా రూపాంతరం చెందే అవకాశం ఉండదని, ఈ లక్షణం వల్లే వ్యాక్సిన్లు కరోనా వైరస్ ను గుర్తించి వెంటనే ఎదురుదాడి చేస్తాయని పేర్కొన్నారు.