Perni Nani: మహిళలకు ఏడాదికి రూ.18,750 ఇవ్వాలని నిర్ణయించాం: మంత్రి పేర్ని నాని
- 45 నుంచి 60 ఏళ్ల మహిళలకు ఆర్థికసాయం
- నాలుగేళ్లలో రూ.18 వేల కోట్ల నుంచి రూ.20 వేల కోట్ల వ్యయం
- జగనన్న తోడు పథకం కింద రూ.10 వేల సాయం
ఇవాళ జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశంలో చర్చించిన వివరాలను, తీసుకున్న నిర్ణయాలను మంత్రి పేర్ని నాని మీడియాకు వెల్లడించారు. 45 ఏళ్ల నుంచి 60 సంవత్సరాల వయసున్న మహిళలకు ఏడాదికి రూ.18,750 ఇచ్చేందుకు సీఎం జగన్ ఆమోదం తెలిపారని, తద్వారా ఎన్నికల ముందు ప్రకటించిన నవరత్నాలను అమలు చేస్తున్నామని వివరించారు.
మహిళలు చిన్న వ్యాపారాలు చేసుకునేందుకు, ఆర్థిక అవసరాల నిమిత్తం, వారి కుటుంబాలు పురోభివృద్ధిలో పయనించేందుకు ఈ మేరకు నాలుగు సంవత్సరాల్లో రూ.18 వేల కోట్ల నుంచి రూ.20 వేల కోట్లు అందించనున్నామని తెలిపారు. ఈ నిర్ణయంతో సుమారు 25 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల మహిళలు లబ్ది పొందుతారని పేర్ని నాని చెప్పారు.
కొత్తగా 'జగనన్న తోడు' అనే పథకం ప్రవేశపెడుతున్నామని, చిరువ్యాపారాలు చేసుకునేవారు, బడ్డీ కొట్లు పెట్టుకున్నవారు, హస్తకళలపై ఆధారపడిన వారు, ఆర్థికంగా వెనుకబడినవారు దీని ద్వారా ఆర్థికసాయం అందుకుంటారని వివరించారు. ఈ పథకంలో సున్నా వడ్డీ కింద రూ.10 వేలు అందజేస్తామని వెల్లడించారు. ఈ పథకం అక్టోబరు నుంచి అమల్లోకి వస్తుందని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చే ఇళ్లలో ఐదేళ్లు నివసించిన తర్వాతే ఆ ఇంటిని అమ్ముకునే అవకాశం కల్పిస్తూ జీవోలో మార్పులు చేయగా, దానికి మంత్రి మండలి ఆమోదించిందని పేర్ని నాని తెలిపారు.