Doctor Sudhakar: జగన్ గారు నాకు దేవుడు.. గుండు గీసిందెవరో చెపితే మళ్లీ గొడవ మొదలవుతుంది: డాక్టర్ సుధాకర్

Jagan is God to me says Vizag Doctor Sudharkar

  • ప్రభుత్వాన్ని తిట్టాల్సిన అవసరం నాకు లేదు
  • ఒక ప్లాన్ ప్రకారమే నాపై దాడి జరిగింది
  • ఆసుపత్రిలో ఉన్నప్పుడు చంపేస్తామని బెదిరించారు

తాను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదని నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ చెప్పారు. మోదీ, చంద్రబాబు, జగన్ అందరూ బాగానే పాలించారని అన్నారు. ప్రభుత్వాన్ని తిట్టాల్సిన అవసరం తనకు లేదని చెప్పారు. 'సీఎం జగన్ గారు నాకు దేవుడు, పేదల కోసం జగన్ మంచి పనులే చేస్తున్నారు... ఆయనను తిట్టాల్సిన అవసరం నాకు లేదు' అన్నారు. మోదీని కూడా తాను విమర్శించలేదని చెప్పారు. అయినా, వాళ్లను తిట్టేంత ధైర్యం తనకు లేదని అన్నారు. ఒక పక్కా ప్లాన్ ప్రకారమే తనపై దాడి జరిగిందని చెప్పారు. విశాఖపట్టణం నాలుగవ పోలీస్ స్టేషన్ వద్ద ఉన్న తన కారును తీసుకునేందుకు డాక్టర్ సుధాకర్ వచ్చారు. ఈ  సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈమేరకు స్పందించారు.

తాను సస్పెండ్ అయినప్పటి నుంచి తనకు దారుణమైన ఫోన్ కాల్స్ వచ్చాయని సుధాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి నుంచి బయటకు రావడానికి కూడా తాను భయపడ్డానని చెప్పారు. బ్యాంక్ పని కోసం తప్పనిసరిగా నక్కపల్లి వెళ్లాల్సి వచ్చిందని... తాను వెళ్తుండగా తనను కొందరు ఫాలో అవుతుండటంతో కారును ఆపానని తెలిపారు. కారులో కొంచెం డబ్బు ఉందని... కారును దిగిన తర్వాత తనపై దాడి జరిగిందని... పోలీసులకు కూడా తప్పుడు సమాచారం ఇచ్చారని చెప్పారు. తప్పుడు పనులు చేస్తున్నట్టు పోలీసులకు తనపై ఫిర్యాదు చేశారని అన్నారు.

తనపై పిచ్చోడి ముద్ర వేసి, ఉద్యోగాన్ని తీయించాలనే కుట్ర చేశారని సుధాకర్ చెప్పారు. టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు ఇంటికి వెళ్లడమే తాను చేసిన తప్పు అని... ఎవరికో చెడ్డ పేరు తెచ్చేందుకు తనను వాడుకున్నారని అన్నారు. తనకు గుండు గీసిందెవరో చెపితే మళ్లీ గొడవ అవుతుందని చెప్పారు. ఆసుపత్రిలో ఉన్నప్పుడు చంపేస్తామని బెదిరిస్తే... మా ఇంట్లో వాళ్లంతా భయపడిపోయారని అన్నారు.

పేదలకు సేవ చేయాలని తాను వైద్య వృత్తిలో కొనసాగుతున్నానని... జీతం రాకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నానని ఆయన తెలిపారు. రాజకీయ అవసరాల కోసం తనను ఎవరూ ఉపయోగించుకోలేదని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ తన ఉద్యోగం తనకు ఇప్పించాలని కోరుతున్నానని అన్నారు. తనకు రాజకీయాలంటేనే అసహ్యమని... ఉద్యోగమే  తనకు ముఖ్యమని చెప్పారు.

  • Loading...

More Telugu News