America: అమెరికాలో సెప్టెంబరు నాటికి కరోనాతో 2 లక్షల మంది చనిపోతారు: వైద్య నిపుణుడి సంచలన వ్యాఖ్యలు
- హార్వర్డ్ గ్లోబల్ హెల్త్ నిపుణుడి సంచలన వ్యాఖ్యలు
- ఇప్పటికే 1,12,754 మంది మృతి
- కఠిన చర్యలు తీసుకోకుంటే కష్టమే
అమెరికాలో సెప్టెంబరు నాటికి కరోనా కారణంగా దాదాపు 2 లక్షల మంది చనిపోతారంటూ హార్వర్డ్ గ్లోబల్ హెల్త్ ఇనిస్టిట్యూట్‌కు చెందిన వైద్య నిపుణుడు ఆశిష్ ఝా చేసిన వ్యాఖ్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. కరోనా వైరస్ కట్టడికి కఠిన చర్యలు తీసుకోకుంటే ఇది ఖాయమని ఆయన పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు, మరణాలు అత్యధికంగా సంభవిస్తున్న దేశాల్లో అమెరికా మొదటి స్థానంలో ఉంది. ఇప్పటి వరకు అక్కడ 1,12,754 మంది ప్రాణాలు కోల్పోయారు.
కరోనా రోగులను క్వారంటైన్ చేయడం, సామాజిక దూరం పాటించడం, ఫేస్ మాస్కులను ధరించడం ద్వారా మరణాల సంఖ్యను నిరోధించవచ్చని ఆశిష్ పేర్కొన్నారు. తాజాగా, న్యూమెక్సికో, ఉటా, అరిజోనా, ఫ్లోరిడా, ఆర్కాన్సాస్‌లలో కరోనా కేసుల సంఖ్య దాదాపు 40 శాతం పెరిగింది. ప్రస్తుతం 50 రాష్ట్రాల్లో వ్యాపార, సామాజిక కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. కాగా, జార్జ్ ఫ్లాయిడ్ మృతికి వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో పాల్గొన్న ప్రజలు సామాజిక దూరాన్ని గాలికి వదిలివేయడం వల్లే దేశంలో కేసుల సంఖ్య పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు.