Karnataka: కొత్త ప్రియుడితో మాజీ ప్రేయసి.. హెల్మెట్‌తో దాడిచేసిన మాజీ ప్రియుడు

Man attacked ex lover with helmet in Bengaluru

  • తీవ్ర గాయాలపాలవడంతో యాక్సిడెంట్ అయిందని నమ్మించే యత్నం
  • అసలు విషయం తెలిసి పోలీసులకు ఫిర్యాదు
  • ఇద్దరు ప్రియుళ్లను అరెస్ట్ చేసిన పోలీసులు

నాలుగేళ్లపాటు ప్రేమించిన యువతి మనస్పర్థల కారణంగా తనను వదిలేసి, తన స్నేహితుడికి దగ్గర కావడంతో జీర్ణించుకోలేకపోయిన యువకుడు ఆమెపై హెల్మెట్‌తో దాడిచేశాడు. ఆమె స్పృహ తప్పి పడిపోవడంతో వారింటికి ఫోన్ చేసి ఆమెకు యాక్సిడెంట్ అయిందని చెప్పి నమ్మించే ప్రయత్నం చేశాడు. చివరికి అసలు విషయం తెలియడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరులోని నెలమంగల సోలదేనహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందీ ఘటన.

పోలీసుల కథనం ప్రకారం.. బబిత్ అనే యువకుడు 21 ఏళ్ల యువతిని నాలుగేళ్లుగా ప్రేమిస్తున్నాడు. ఇటీవల వీరిమధ్య మనస్పర్థలు రావడంతో యువతి దూరంగా ఉంటోంది. ఈ క్రమంలో ప్రియుడి స్నేహితుడైన రాహుల్‌కు దగ్గరైంది. యువతి రాహుల్ ఇంట్లో ఉండగా అకస్మాత్తుగా అక్కడికి వచ్చిన యువకుడు వారిద్దరూ సన్నిహితంగా ఉండడాన్ని చూసి జీర్ణించుకోలేకపోయాడు. వెంటనే తన చేతిలో ఉన్న హెల్మెట్‌తో ఆమెపై దాడిచేశాడు.

గాయాలపాలైన యువతి స్పృహ తప్పి పడిపోవడంతో ఆమె ఇంటికి ఫోన్ చేసిన బబిత్, ఆమెకు యాక్సిడెంట్ అయిందని చెప్పాడు. బాధిత యువతిని ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో తమ కుమార్తెపై దాడి జరిగిందని తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బబిత్, రాహుల్‌ను అరెస్ట్ చేశారు.

Karnataka
Bengaluru
Love
Crime News
  • Loading...

More Telugu News