Narayana Swamy: అనితారాణికి అన్యాయం చేశానని నిరూపిస్తే రాజీనామా చేస్తా: డిప్యూటీ సీఎం నారాయణస్వామి

I have not done injustice to doctor Anitha Rani says Narayana Swamy

  • దళితుడిగా సాటి దళిత మహిళకు ఎలా అన్యాయం చేస్తా?
  • చంద్రబాబు కుల రాజకీయాలు చేస్తున్నారు
  • సీఐడీ విచారణలో నా నిజాయతీ బయటపడుతుంది

వైసీపీ నేతలు తనను వేధింపులకు గురి చేశారంటూ చిత్తూరు జిల్లాకు చెందిన ప్రభుత్వ డాక్టర్ అనితారాణి ఆరోపించిన సంగతి తెలిసిందే. బాత్రూమ్ లో కూడా తనను ఫొటోలు తీశారని చెప్పారు. దళిత సామాజికవర్గానికి చెందిన వారిపై దాడులు జరుగుతున్నాయని అన్నారు. డాక్టర్ సుధాకర్ తర్వాత డాక్టర్ అనిత వ్యవహారం ఏపీలో చర్చనీయాంశంగా మారింది. వైసీపీపై విపక్ష నేతలు విమర్శలను ఎక్కుపెట్టారు. మరోవైపు డాక్టర్ అనిత పని చేస్తున్న హాస్పిటల్ డిప్యూటీ సీఎం నారాయణస్వామి నియోజకవర్గంలో ఉండటంతో... విపక్షాలు ఆయనను కూడా టార్గెట్ చేశాయి. చంద్రబాబు కూడా తీవ్ర విమర్శలు గుప్పించారు.

ఈ నేపథ్యంలో నారాయణస్వామి స్పందిస్తూ... అనితారాణికి తాను అన్యాయం చేశానని నిరూపిస్తే పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు. ఈరోజు చిత్తూరులో జరిగిన 'జగనన్న చేదోడు' కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు కుల రాజకీయాలను తెరపైకి తెస్తున్నారని మండిపడ్డారు. ఒక దళితుడిగా సాటి దళిత మహిళకు ఎలా అన్యాయం చేస్తానని ప్రశ్నించారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి జగన్ సీఐడీ విచారణకు ఆదేశించారని... విచారణలో తన నిజాయతీ ఏంటో తెలుస్తుందని చెప్పారు. తాను నిర్దోషినని నిరూపణ అయితే చంద్రబాబు పదవికి రాజీనామా చేస్తారా? అని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News