Sachin Tendulkar: బంతికి ఉమ్మి రాయకుండా ఉండేందుకు.. ఐసీసీకి సచిన్ కొత్త సలహా
- టెస్టుల్లో ఇన్నింగ్స్ లో 80 ఓవర్ల తర్వాత కొత్త బంతిని ఇస్తారు
- ఇప్పుడు 50 ఓవర్లకే కొత్త బంతిని అందిస్తే సరిపోతుందన్న సచిన్
- త్వరలో ప్రారంభకానున్న ఇంగ్లాండ్, విండీస్ టెస్ట్ సిరీస్
కరోనా నేపథ్యంలో క్రికెట్ సంప్రదాయాలు మారిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. బంతి షైనింగ్ కోసం బౌలర్లు బంతికి ఉమ్మిని పూయడం ఎప్పటి నుంచో వస్తోంది. అయితే, కరోనా కారణంగా ఉమ్మిని ఉపయోగించకూడదని పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తున్నాయి. దీంతో ఉమ్మిని వాడవద్దని ఐసీసీ సూచించింది.
ఈ నేపథ్యంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ స్పందించాడు. ఉమ్మిని వాడకుండా చేయడమనేది కఠినమైన నిర్ణయమని చెప్పాడు. బంతిని మెరిపించడానికి లాలాజలం వాడాలనే విషయాన్ని చిన్నప్పటి నుంచే నేర్పిస్తారని తెలిపాడు. ఇప్పుడు హఠాత్తుగా దీన్ని ఆపేయడం కష్టమేనని చెప్పాడు. టెస్టుల్లో ఇన్నింగ్స్ లో 80 ఓవర్ల తర్వాత కొత్త బంతి అందుబాటులోకి వస్తుందని... లాలాజల నిషేధం కారణంగా బౌలర్లకు మద్దతుగా 50 ఓవర్లకే కొత్త బంతిని అందిస్తే సరిపోతుందని ఐసీసీకి సచిన్ సూచించాడు. ఈ నేపథ్యంలో త్వరలో ప్రారంభం కానున్న ఇంగ్లాండ్, వెస్టిండీస్ టెస్ట్ సిరీస్ లో ఏం జరుగుతుందో వేచి చూడాలి.