Delhi: జులై చివరి నాటికి ఢిల్లీలో ఐదున్నర లక్షల కేసులు: డిప్యూటీ సీఎం మనీశ్ శిసోడియా
- జులై నెలాఖరుకు 80 వేల బెడ్లు అవసరమవుతాయి
- ఈ నెలాఖరుకి 15 వేల బెడ్లు కావాలి
- లెఫ్టినెంట్ గవర్నర్ సమీక్ష అనంతరం శిసోడియా వ్యాఖ్యలు
ఢిల్లీలో కరోనా ఏ స్థాయిలో విస్తరిస్తోందో డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా వ్యాఖ్యలతో అర్థమవుతోంది. జులై 31 నాటికి ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య ఐదున్నర లక్షలకు చేరుకుంటుందని ఆయన చెప్పారు. అప్పటికి ఢిల్లీకి 80 వేల బెడ్లు అవసరమవుతాయని తెలిపారు. ఈ నెలాఖరుకి 15 వేల బెడ్లు అవసరమవుతాయని చెప్పారు.
పేషెంట్లకు బెడ్లు దొరక్క చాలా ఇబ్బంది పడే పరిస్థితి తలెత్తుతుందని అన్నారు. కరోనా పరిస్థితిపై ఈరోజు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ సమీక్షా సమావేశం నిర్వహించారు. సమీక్ష అనంతరం మీడియాతో శిసోడియా మాట్లాడుతూ ఈ మేరకు ఆందోళనకర వ్యాఖ్యలు చేశారు.
ఇప్పటి వరకైతే కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి లేదని శిసోడియా చెప్పారు. అయితే అంతకు ముందు ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్ మీడియాతో మాట్లాడుతూ, నగరంలో కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి ఉందని తెలిపారు. వైరస్ ఎవరి నుంచి ఎలా సోకిందో కూడా తెలియని కేసులు సగానికి పైగా నమోదవుతున్నాయని చెప్పారు.
ఢిల్లీలో ఇప్పటి వరకు 27,654 కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో 10,664 మంది కోలుకున్నారు. 761 మంది ప్రాణాలు కోల్పోయారు. కేసులు అంతకంతకూ పెరుగుతుండటంతో... పరిస్థితిపై లెఫ్టినెంట్ గవర్నర్ సమీక్ష నిర్వహించారు.