Pakistan: పాకిస్థాన్ మాజీ ప్రధానికి కరోనా పాజిటివ్.. ఇప్పటివరకు నలుగురు ప్రజాప్రతినిధుల మృతి!
- మాజీ ప్రధాని అబ్బాసి, రైల్వే మంత్రి రషీద్ కు కరోనా పాజిటివ్
- 2017 ఆగస్ట్ నుంచి 2018 మే వరకు ప్రధానిగా ఉన్న అబ్బాసి
- కరోనా బారిన పడి నలుగురు ప్రజాప్రతినిధుల మృతి
పాకిస్థాన్ లో కరోనా పంజా విసురుతోంది. దాన్ని కట్టడి చేయలేక అక్కడి ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం దాదాపు చేతులెత్తేస్తోంది. కరోనా మహమ్మారి దెబ్బకు అక్కడి రాజకీయ ప్రముఖులు సైతం బాధితులుగా మిగిలిపోతున్నారు. సాక్షాత్తు మాజీ ప్రధాని షాహిద్ ఖాకాన్ అబ్బాసి కరోనా బారిన పడ్డారు. పాక్ రైల్వే మంత్రి షేక్ రషీద్ అహ్మద్ కు కూడా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దీంతో వీరంతా క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు.
61 ఏళ్ల అబ్బాసి కరోనా వైరస్ బారిన పడ్డారని నవాజ్ షరీఫ్ కు చెందిన పాకిస్థాన్ ముస్లిం లీగ్ (ఎన్) పార్టీ అధికార ప్రతినిధి మర్యం ఔరంగజేబ్ ప్రకటించారు. అవినీతి కేసులో కోర్టు తీర్పు మేరకు ప్రధాని పదవి నుంచి నవాజ్ షరీఫ్ తప్పుకున్న సమయంలో అబ్బాసి పీఎంగా బాధ్యతలను నిర్వహించారు. 2017 ఆగస్ట్ నుంచి 2018 మే వరకు ఆయన ప్రధానిగా ఉన్నారు.
షేక్ రషీద్ అహ్మద్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని రైల్వే శాఖ ప్రకటించింది. ఆయన సెల్ఫ్ ఐసొలేషన్ కు వెళ్లిపోయారని.. డాక్టర్ల సలహా మేరకు రెండు వారాల పాటు క్వారంటైన్ లో ఉంటారని తెలిపింది.
వీరితో పాటు పాకిస్థాన్ పీపుల్స్ పార్టీకి చెందిన మాజీ మంత్రి షర్జీల్ మిమాన్, తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ కు చెందిన ఎంపీ అలీ అక్తర్ కు కూడా కరోనా సోకింది. ఇప్పటి వరకు నలుగురు ప్రజాప్రతినిధులు కరోనా బారిన పడి మరణించారు.