Gang War: విజయవాడ గ్యాంగ్ వార్: పండు తల్లి పాత్రపై విచారణ జరుపుతున్న పోలీసులు

Police arrests eleven members of Sandeep gang
  • తాజాగా సందీప్ గ్యాంగుకు చెందిన 11 మంది అరెస్ట్
  • అరెస్టయిన వారిలో సందీప్ సోదరుడు
  • సందీప్ గ్యాంగుకు చెందిన కిరణ్ వల్లే గొడవ జరిగిందంటున్న పోలీసులు
గత నెల 30న విజయవాడలోని పటమట తోటవారి వీధిలో జరిగిన గ్యాంగ్ వార్ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఈ ఘటనలో సందీప్ అనే యువకుడు మృతిచెందడం తెలిసిందే. దీనిపై విచారణ జరుపుతున్న బెజవాడ పోలీసులు తాజాగా సందీప్ గ్యాంగుకు చెందిన 11 మందిని అరెస్ట్ చేశారు. పోలీసులు రెండ్రోజుల కిందటే మరో గ్యాంగ్ లీడర్ పండు వర్గానికి చెందిన 13 మందిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ రెండు గ్యాంగులకు చెందిన మరికొందరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

కాగా, తాజాగా అరెస్టయిన వారిలో మృతుడు సందీప్ సోదరుడు జగదీశ్ కూడా ఉన్నాడు. మంగళగిరికి చెందిన ఇద్దరు రౌడీషీటర్లు కూడా పోలీసుల అదుపులో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనతో ప్రమేయం ఉన్నట్టు భావిస్తున్న రౌడీషీటర్లపై నిఘా ఉంచామని డీసీపీ హర్షవర్ధన్ తెలిపారు. గ్యాంగ్ వార్ కేసులో పండు తల్లి పాత్రపైనా విచారణ జరుపుతున్నామని వెల్లడించారు. అంతేకాకుండా, అపార్ట్ మెంట్ సెటిల్మెంట్, గ్యాంగ్ వార్ ఘటనలపై వేర్వేరు కేసులు నమోదు చేసినట్టు వివరించారు. సందీప్ గ్యాంగ్ కు చెందిన కిరణ్ కుమార్ దుందుడుకుతనం వల్లే గొడవ జరిగినట్టు గుర్తించినట్టు డీసీపీ తెలిపారు.
Gang War
Vijayawada
Sandeep
Pandu
Police

More Telugu News