Anitha Rani: సుధాకర్ లాగానే నన్నూ వేధిస్తున్నారు... పోలీసులు పట్టించుకోవడం లేదంటూ వాపోయిన డాక్టర్ అనితారాణి!

Dr Anita Rani Alleges on YSRCP Leaders

  • మెనుమూరు ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ గా అనితారాణి
  • కింది స్థాయి సిబ్బంది అవినీతిని ప్రశ్నించినందుకు వేధింపులు
  • పోలీసులు పట్టించుకోవడం లేదని ఆవేదన

తనను వైకాపా నేతలు డాక్టర్ సుధాకర్ లాగానే నిర్బంధించి, వేధించారని ఆరోపిస్తూ, చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరుకు చెందిన పెనుమూరు ప్రభుత్వ వైద్యశాల డాక్టర్ అనితారాణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను అమెరికాలో ఉద్యోగం వచ్చినా, దాన్ని వదులుకుని పేదలకే సేవ చేయాలన్న ఉద్దేశంతో వచ్చానని, తనను తీవ్ర ఇబ్బందులు పెడుతూ, నిత్యమూ అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ మేరకు తాను పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోవడం లేదని మీడియా ముందు వాపోయారు.

కింది స్థాయి సిబ్బంది పాల్పడుతున్న అవినీతిని ప్రశ్నించడమే తన తప్పయిపోయిందని, తనపై కక్ష కట్టిన స్థానిక అధికార పార్టీ నేతలు, జనతా కర్ఫ్యూ రోజున తనను ఓ గదిలో బంధించి, రకరకాలుగా వేధించి, దుర్భాషలాడారని, తనతో అభ్యంతరకరంగా ప్రవర్తించారని ఆమె తెలిపారు. వాష్ రూములో తన ఫొటోలు, వీడియోలు తీసి మానసిక వేధింపులకు గురి చేశారని అన్నారు.

తాను పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళితే, ఫిర్యాదు తీసుకోకుండా దాదాపు 11 గంటల పాటు కూర్చోబెట్టారని, ఉన్నతాధికారులతో ఫోన్ చేయించి కేసు పెట్టవద్దని బెదిరింపులకు దిగారని ఆమె తెలిపారు. తనను ఆదుకోవాలని కోరుతూ, తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనితకు ఆమె చేసిన ఫోన్ కాల్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోపక్క, ఈ విషయంపై తాను హైకోర్టుకు కూడా వెళ్లినట్టు ఆమె తెలిపారు.

  • Loading...

More Telugu News