Smell: అర్ధరాత్రి నుంచి అంతుచిక్కని వాసన... అదేంటో అర్థంకాక ముంబయి వాసుల్లో భయాందోళనలు

Foul smell haunts Mumbai people

  • ముంబయి మహానగరంలో ఘాటు వాసనలు
  • మూలం ఏమిటో గుర్తించలేకపోయిన అధికారులు
  • గత సంవత్సరం కూడా ఇదే తరహాలో వాసనలు

ఇటీవలే వైజాగ్ నగరంలో ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి గ్యాస్ లీకై 14 మంది మృతి చెందిన ఘటన దేశంలో తీవ్ర కలకలం రేపింది. ఈ నేపథ్యంలో, ముంబయి మహానగరంలో గత అర్ధరాత్రి నుంచి ఓ అంతుచిక్కని వాసన ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. ఈ వాసన ఎక్కడ్నించి వస్తుందో కూడా ఇంతవరకు పసిగట్టలేకపోయారు. ముంబయిలోని అంధేరి, ఘట్కోపర్, విఖ్రోలీ, చెంబూర్  తదితర ప్రాంతాల్లో భరింపరాని వాసన వస్తుండడంతో ప్రజలు అధికారులకు ఫిర్యాదు చేశారు.

దాంతో అధికారులు గ్యాస్ లీక్ గా భావించి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించారు. వారికి తోడు 17 ఫైరింజన్లు కూడా ఈ వాసన ఎక్కడ్నించి వస్తుందో కనిపెట్టేందుకు విఫలయత్నం చేశాయి. అంతేకాదు, ప్రమాదకర రసాయన పదార్థాలను గుర్తించే హజ్మత్ వాహనాన్ని కూడా తీసుకువచ్చినా ప్రయోజనం లేకపోయింది. సమీపంలోని రసాయన పరిశ్రమలు, చమురు కంపెనీలను పరిశీలించినా అసలు ఆ వాసన ఎక్కడ్నించి వస్తున్నదో కూడా గుర్తించలేకపోయారు. అయితే, ఇది గ్యాస్ లీక్ వాసన అయ్యుండదని భావిస్తున్న అధికారులు, దాని మూలాలు ఎక్కడున్నాయో తెలుసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. గతేడాది కూడా ఇదే తరహాలో వాసన వచ్చిందని స్థానికులు చెబుతున్నారు.

Smell
Mumbai
People
LG Polymers
Vizag Gas Leak
  • Loading...

More Telugu News