Justin Trudeau: నల్ల జాతీయులకు మద్దతుగా వచ్చి మోకాళ్లపై కూర్చున్న కెనడా ప్రధాని ట్రూడో!
- కెనడాకూ పాకిన నిరసనలు
- జార్జ్ కు న్యాయం చేయాలన్న జస్టిన్ ట్రూడో
- కెనడాలో పౌర హక్కులకు భంగం ఉండదని హామీ
అమెరికాలోని మిన్నెపోలిస్ ప్రాంతంలో పోలీసుల చేతిలో మరణించిన జార్జ్ ఫ్లాయిడ్ కు మద్దతుగా జరుగుతున్న నిరసనల్లో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో పాల్గొన్నారు. పార్లమెంటు ఆవరణలో జరిగిన ప్రదర్శనకు వచ్చిన ఆయన మోకాళ్లపై కూర్చుని జార్జ్ కు న్యాయం జరగాలంటూ సంఘీభావం ప్రకటించారు. "నో జస్టిస్ నో పీస్" పేరిట ఈ కార్యక్రమం జరిగింది.
అయితే ఈ కార్యక్రమంలో ట్రూడో ప్రసంగించకుండానే వెళ్లిపోయినప్పటికీ, ఆయన అక్కడికి రాగానే వేలాదిమంది నిరసనకారులు "స్టాండప్ టూ ట్రంప్" అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమం అమెరికా పరిధిలో జరిగినప్పటికీ, అక్కడి నల్లజాతీయుల నిరసన సెగలు, పక్కనే ఉన్న కెనడానూ తాకాయి. ఈ నేపథ్యంలోనే తమ దేశంలో పౌర హక్కులకు భంగం కలుగబోదన్న నమ్మకాన్ని ప్రజలకు కల్పించేందుకు ప్రధాని ట్రూడో స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని ఉన్నతాధికారులు వెల్లడించారు.