India: కేసుల విషయంలో స్పెయిన్ ను దాటేసిన ఇండియా... ఇప్పుడిక వరల్డ్ టాప్-5
- 2.44 లక్షలను దాటేసిన ఇండియా కేసులు
- స్వల్పంగా తగ్గిన రికవరీ రేటు
- మొత్తం మరణాల సంఖ్య 6,642కు పెరుగుదల
ఇండియాలో కరోనా మహమ్మారి శరవేగంగా పరుగులు పెడుతోంది. తాజాగా శనివారం నాడు వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం కొత్త 9,887 కేసులు నమోదు కాగా, ఇప్పటివరకూ మొత్తం కేసుల సంఖ్య విషయంలో ఆరో స్థానంలో ఉన్న ఇండియా, ఐదో స్థానానికి ఎగబాకింది. ఈ క్రమంలో కొన్ని వారాల క్రితం కరోనాకు కేంద్రంగా పేరు తెచ్చుకున్న స్పెయిన్ ను ఇండియా అధిగమించింది. ప్రస్తుతం ఇండియాకన్నా ముందు అమెరికా, బ్రెజిల్, రష్యా, బ్రిటన్ ఉన్నాయి.
స్పెయిన్ లో 2,40,978 కేసులుండగా, ఇండియాలో కేసుల సంఖ్య 2.44 లక్షలను దాటేసింది. ఇదే సమయంలో రికవరీ రేటు 48.27 శాతం నుంచి 48.20 శాతానికి తగ్గింది. గడచిన 24 గంటల్లో 294 మంది మరణించగా, మొత్తం మరణాల సంఖ్య 6,642కు చేరింది. కేసుల సంఖ్య విషయంలో శుక్రవారం నాడు ఇటలీని అధిగమించిన భారత్, 24 గంటలు తిరక్కముందే స్పెయిన్ ను దాటేసింది. ఇండియాలో ప్రస్తుతం లక్షకు పైగా యాక్టివ్ కేసులు ఉండటం గమనార్హం.