Inter Caste Marriages: కులాంతర వివాహాలకు ప్రోత్సాహకం..రూ.2.50 లక్షల నజరానా
- కులాంతర వివాహాలకు తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహకం
- నజరానా రూ. 50 వేల నుంచి రూ. 2.50 లక్షలకు పెంపు
- మార్గదర్శకాలను విడుదల చేసిన ప్రభుత్వం
కులాల మధ్య అంతరాన్ని పోగొట్టేందుకు... కులాంతర వివాహాలను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కులాంతర వివాహాలు చేసుకునే వారికి రూ. 2.50 లక్షల నజరానా ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఇప్పటి వరకు కులాంతర వివాహాలు చేసుకునే వారికి రూ. 50 వేలు మాత్రమే ఇచ్చేవారు. ఇప్పుడు దీన్ని ఏకంగా రూ. 2.50 లక్షలకు పెంచారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది.
ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలనుకునే జంట జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకుల కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్ లైన్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారు. వధూవరుల ఫొటోలు, ఇద్దరి కుల ధ్రువీకరణ పత్రాలు, వయసు ధ్రువీకరణ పత్రాలు, వివాహ ధ్రువీకరణ పత్రం, వధూవరుల బ్యాంక్ జాయింట్ అకౌంట్ డీటెయిల్స్, పెళ్లికి సాక్షులుగా ఉన్న వారి వివరాలు, ఆదాయ ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, రేషన్ కార్డు సమర్పించాలి.