Rajat Kumar: ఆ జలాలను వాడుకుంటే అభ్యంతరం ఏంటి?: తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి
- ముగిసిన గోదావరి బోర్డు సమావేశం
- హాజరైన రజత్ కుమార్
- కిరణ్ కుమార్ రెడ్డి చేసిన కేటాయింపులను ప్రస్తావించిన వైనం
ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారం కోసం గోదావరి నదీ యాజమాన్య బోర్డు హైదరాబాదులోని జలసౌధ భవనంలో సమావేశమైంది. ఈ సమావేశానికి హాజరైన తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ అనేక అంశాలను లేవనెత్తారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ గోదావరి జలాల్లోంచి 967.14 టీఎంసీల నీటిని తెలంగాణకు ఇవ్వాలని అన్నారని, ఇప్పుడా జలాలను తాము వాడుకుంటే అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు. గోదావరి కేటాయింపుల్లో పేర్కొన్న జలాలను ఎక్కడైనా వాడుకునే వెసులుబాటు ఉందన్న విషయాన్ని ట్రైబ్యునల్ కూడా చెప్పిందన్న విషయాన్ని రజత్ కుమార్ ఈ సందర్భంగా ప్రస్తావించారు.
తమకు కేటాయించిన జలాల అంచనాలకు అనుగుణంగానే ప్రాజెక్టుల నిర్మాణం సాగుతోందని, కొత్తగా తామేమీ ప్రాజెక్టులు నిర్మించడంలేదని స్పష్టం చేశారు. కాళేశ్వరం, ప్రాణహిత ప్రాజెక్టులను కొత్త ప్రాజెక్టులుగా చూడొద్దని పేర్కొన్నారు.