Gang War: చనిపోయిన తోట సందీప్, గాయాలపాలైన పండు ఒకప్పుడు స్నేహితులే: విజయవాడ 'గ్యాంగ్ వార్' గురించి సీపీ ద్వారకా తిరుమలరావు

Police commissioner explains Vijayawada gangwar
  • ఇటీవల విజయవాడలో గ్యాంగ్ వార్
  • తోట సందీప్ అనే యువకుడి మృతి
  • మీడియా సమావేశంలో మాట్లాడిన విజయవాడ సీపీ
మూడున్నర దశాబ్దాల కిందటి బెజవాడ ఎలావుండేదో ఇటీవల జరిగిన గ్యాంగ్ వార్ కళ్లకు కట్టింది. యావత్ రాష్ట్రం కరోనాతో సతమతమవుతున్న వేళ అందరినీ దిగ్భ్రాంతిగొలిపే రీతిలో విజయవాడలో కొందరు యువకులు దొమ్మీ తరహాలో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ దాడిలో ఓ వర్గానికి నాయకుడైన తోట సందీప్ మరణించాడు. మరో గ్యాంగు నాయకుడు పండు ప్రస్తుతం గుంటూరులో చికిత్స పొందుతున్నాడు.

సంచలనం సృష్టించిన ఈ గ్యాంగ్ వార్ గురించి విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమల రావు మీడియాకు వివరాలు తెలిపారు. చావోరేవో అన్నట్టుగా కొట్టుకున్న తోట సందీప్, పండు ఒకప్పుడు స్నేహితులని వెల్లడించారు. అయితే ఓ రియల్ ఎస్టేట్ వివాదం వీరిద్దరి మధ్య ఘర్షణకు దారితీసిందని తెలిపారు.

"వివాదం మొదలైంది ప్రదీప్ రెడ్డి, శ్రీధర్ అనే వ్యక్తుల మధ్య. యనమలకుదురులో 7 సెంట్ల స్థలం కోసం ఇరువురు గొడవపడ్డారు.  ఇందులో ప్రదీప్ అనే వ్యక్తి బుట్టా నాగబాబును ఆశ్రయించాడు. ఈ వ్యవహారం నడుస్తుండగానే... సందీప్, పండు తలదూర్చారు. పండు ఈ సెటిల్మెంట్ లో జోక్యం చేసుకోవడం సందీప్ కు నచ్చలేదు. అదే విషయాన్ని ఫోన్ చేసి నిలదీశాడు. ఆపై పండు తల్లితో కూడా సందీప్ గొడవపడ్డాడు. దాంతో ఆగ్రహించిన పండు తన అనుచరులతో కలిసి సందీప్ షాపుపై దాడి చేసి వర్కర్లను గాయపరిచాడు. దాంతో గ్యాంగ్ వార్ కు రంగం సిద్ధమైంది.

తోటా వారి వీధిలో ఓ ఖాళీ స్థలంలో ఇరు వర్గాలు దాడులు చేసుకున్నాయి. మాట్లాడుకుందాం అని వచ్చారు. కానీ మాటామాటా ముదరడంతో ఒకరిపై ఒకరు కళ్లలో కారం చల్లుకుంటూ దాడికి దిగారు. బలమైన గాయాల కారణంగా సందీప్ మరణించాడు. పండుకు కూడా గాయాలైనా జీజీహెచ్ లో చికిత్స పొందుతున్నాడు. ఇప్పటివరకు ఘటనలో పాలుపంచుకున్న 13 మందిని అరెస్ట్ చేశాం. వారి నుంచి 3 బైక్ లు, పలు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నాం. ఈ దాడిలో పాల్గొన్న వారిలో విద్యార్థులంటూ ఎవరూ లేరు" అంటూ వివరించారు. అయితే, మరోసారి నగరంలో ఇలాంటి ఘర్షణలు జరిగితే తీవ్ర చర్యలు ఉంటాయని ద్వారకా తిరుమలరావు హెచ్చరించారు.
Gang War
Vijayawada
Thota Sandeep
Pandu
Police

More Telugu News