Anamika Shukla: వక్రమార్గంలో 13 నెలల్లో రూ.1 కోటి సంపాదించిన యూపీ పంతులమ్మ!
- ఏకకాలంలో 25 స్కూళ్లలో పనిచేస్తున్నట్టు రికార్డుల్లో వెల్లడి
- అన్ని స్కూళ్ల నుంచి జీతాలు అందుకున్న సైన్స్ టీచర్
- విచారణ షురూ చేసిన అధికారులు
ఒకప్పటితో పోలిస్తే ఇప్పటి ప్రభుత్వ ఉపాధ్యాయులకు జీతాలు బాగానే వస్తున్నాయి. అయితే ఉత్తరప్రదేశ్ లోని ఓ లేడీ టీచర్ మరీ దురాశకు పోయి దొరికిపోయింది. అనామిక శుక్లా అనే సైన్స్ టీచర్ కేవలం 13 నెలల వ్యవధిలో కోటి రూపాయలు సంపాదించింది. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ (కేజీబీవీ)లో అనామిక శుక్లా సైన్స్ టీచర్ గా పనిచేస్తోంది. ఒకే స్కూల్లో పనిచేస్తూ కోటి రూపాయలంటే ఎవరికైనా సందేహం రాకమానదు. కానీ, అనామిక 25 స్కూళ్లలో టీచర్ గా కొనసాగుతున్నట్టు రికార్డుల్లో వెల్లడైంది. పైగా బయోమెట్రిక్ వేలిముద్రలు ఉండనే ఉంటాయి. అయినా ఆమె ఎలా మేనేజ్ చేసిందో తెలియక అధికారులు విచారణకు ఆదేశించారు.
టీచర్లకు సంబంధించిన డేటా బేస్ సిద్ధం చేస్తుండగా, అమ్మడి దురాశ బయటపడింది. ఈ పాతిక స్కూళ్ల రికార్డులన్నీ పరిశీలిస్తే... అక్కడ పనిచేసే టీచర్ల జాబితాలో అనామిక పేరు ఉన్నట్టు గుర్తించారు. దాంతో ఆమెకు ప్రతి స్కూల్ నుంచి జీతం అందుతున్నట్టు తెలుసుకున్నారు. ఒకట్రెండు స్కూళ్లలో బయోమెట్రిక్ హాజరు మేనేజ్ చేయొచ్చని, ఇన్ని స్కూళ్లలో వేలిముద్రల విషయంలో ఎవరికీ అనుమానం రాలేదంటే దీంట్లో ఇంకెవరి ప్రమేయం ఉందా అన్న కోణంలోనూ అధికారులు విచారణ సాగిస్తున్నారు.