Corona Virus: కేసులు శరవేగంగా పెరుగుతున్న వేళ కేంద్రం కొత్త మార్గదర్శకాలు... కరోనా వచ్చినా ఇంటికే పరిమితం!
- రోజుకు సుమారు 10,000 కొత్త కేసులు
- 17 రోజులు ఇంట్లోనే ఉండి చికిత్స
- అత్యవసరమైతేనే వైద్యులను సంప్రదించాలి
- కేంద్రం సరికొత్త మార్గదర్శకాలు
ఇండియాలో రోజుకు సుమారు 10 వేల కరోనా కేసులు నమోదవుతున్న వేళ, కేంద్రం తాజా మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇకపై వైరస్ సోకినా ఇంట్లోనే ఉంచి చికిత్స చేయించుకోవాలి. వైద్యుల పర్యవేక్షణ, వారిచ్చే సలహాలతో 17 రోజుల పాటు చికిత్స జరుగుతుందని, మరింత అత్యవసరమైతే టోల్ ఫ్రీ నంబర్ ను సంప్రదించాలని సూచించింది.
వైరస్ సోకిన వారికి చిన్నారులు, వృద్ధులను దూరంగా ఉంచాలని, ఇదే సమయంలో ఇంట్లోని వారంతా పోషకాహారాన్ని తీసుకోవాలని పేర్కొంది. వైరస్ లక్షణాలు కనిపించినా, వైరస్ సోకినట్టు నిర్దారణ అయినా ఎటువంటి ఆందోళనా చెందాల్సిన అవసరం లేదని పేర్కొంటూ గురువారం నాడు నూతన గైడ్ లైన్స్ ను విడుదల చేసింది. ఈ విషయంలో అత్యవసరమైతే 18005994455 టోల్ ఫ్రీ నంబరును సంప్రదించ వచ్చని వెల్లడించింది.
ఇక ఇంట్లోనే చికిత్స పొందే వారిని ధారాళంగా గాలి వీచే గదిలో ఉంచాలని, ప్రత్యేక బాత్ రూమ్ ను కేటాయించి, ఇంట్లో ఆరోగ్యంగా ఉన్న వారితో సేవలను అందించవచ్చని వెల్లడించింది. అనుమానితులు వైద్యుల సలహా మేరకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ టాబ్లెట్లు వేసుకోవచ్చని, వీటి కోసం స్థానిక ఆరోగ్య కేంద్రంలో సంప్రదించాలని సూచించింది. ఇంట్లో ఎవరికైనా వ్యాధి సోకితే, ఆ ఇంటిలోని చిన్నారులు, వృద్ధులను వీలైతే మరో ప్రాంతానికి పంపాలని పేర్కొంది.
ప్రతి ఒక్కరూ ఆరోగ్య సేతు యాప్ ను తమ ఫోన్లలో ఉంచుకోవాలని, ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలకు సమాచారం ఇవ్వాలని కేంద్రం తన మార్గదర్శకాల్లో పేర్కొంది. మంచం మీద నుంచి దిగినా, బయటకు వచ్చినా మాస్క్ ధరించాలని, దగ్గినా, తుమ్మినా రుమాలు లేదా టిష్యూలను అడ్డుగా పెట్టుకుని, ఆపై వాటిని డస్ట్ బిన్ లో వేయాలని, రోజుకు రెండు లీటర్ల గోరు వెచ్చని నీళ్లు తప్పనిసరిగా తాగాలని వెల్లడించింది.
ఇక ఏ వస్తువును చేతితో తాకినా దాన్ని వెంటనే శానిటైజ్ చేయాలని, వైరస్ సోకిన వారు తానున్న గదిని తానే స్వయంగా శుభ్రం చేసుకోవాలని పేర్కొంది. తన దుస్తులను డెట్టాల్ వేసిన వేడినీటిలో అరగంట నానబెట్టి, వాటిని ఉతికి, స్వయంగా ఆరేసుకుని వాడుకోవచ్చని, అస్వస్థత తీవ్రమైనా, కొత్త లక్షణాలు కనిపించినా వైద్యులను సంప్రదించాలని వెల్లడించింది.
ముఖం, పెదవులు నీలం రంగులోకి మారినా, విపరీతంగా జ్వరం వచ్చినా, గుండెలో నొప్పి వచ్చినా, ఊపిరి ఆడకపోయినా వైద్యులను సంప్రదించవచ్చని, మిగతా కరోనా లక్షణాలున్నా, ప్రమాదం లేదని కేంద్రం పేర్కొంది. బాధితుల గదిలోకి వెళ్లిన సమయంలో ఇతరులు మూడు పొరలు ఉన్న మాస్క్ ను ధరించాలని, మాస్క్ ను ధరించిన తరువాత ముట్టుకోరాదని, వినియోగం తరువాత కాల్చి వేయాలని సూచించిన కేంద్ర ఆరోగ్య శాఖ, ఆ గది లోపలికి వెళ్లేటప్పుడు, వచ్చిన తరువాత చేతులను శుభ్రంగా కడుక్కోవాలని వెల్లడించింది.
రోగి కోసం వండిన ఆహారాన్ని అతనున్న గదికే చేర్చాలని, శరీర ఉష్ణోగ్రత 100 డిగ్రీల ఫారన్ హీట్ దాటి, నాడి వేగం పెరిగితే వైద్యులకు సమాచారం ఇవ్వాలని, రోగి వాడే అన్ని రకాల వస్తువులనూ 30 నిమిషాలు వేడి నీటిలో ఉంచి, ఆపై శుభ్రం చేసి, తిరిగి వాడుకోవచ్చని తెలిపింది. ఇక వైరస్ సోకిన వ్యక్తి ఇంటి పక్కనే ఉన్నా, ఇరుగు పొరుగు వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తమను తాము రక్షించుకునేందుకు పరిసరాలను ప్రతి ఒక్కరూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించింది. క్వారంటైన్ లో ఉండాల్సిన వ్యక్తులు బయట కనిపిస్తే, అధికారులకు తెలియజేయాలని పేర్కొంది.
వ్యాధి సోకిన వారితో పాటు ప్రతి ఒక్కరూ పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలని, బ్రౌన్ రైస్, గోధుమలు, చిరు ధాన్యాలు, బీన్స్, చిక్కుడు, ఓట్స్ తదితర ప్రొటీన్స్ అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలని, పండ్లు, క్యారెట్, బీట్ రూట్, నిమ్మ, బత్తాయి, క్యాప్సికమ్ అధికంగా తీసుకోవాలని, ఆహారంలో పసుపు, అల్లం, వెల్లుల్లి వంటివి చేర్చాలని సూచించింది. నిల్వ ఉంచిన పదార్థాలు తీసుకోవద్దని, మైదా, వేపుళ్లు, జంక్ ఫుడ్, కూల్ డ్రింక్స్, పామాయిల్, బటర్ లకు దూరంగా ఉండాలని సలహా ఇచ్చింది.