Hotels: కేంద్ర నిబంధనల మేరకు హోటళ్లు, పర్యాటక కార్యకలాపాలు ప్రారంభిస్తాం: అవంతి
- జూన్ 8 నుంచి రాష్ట్రంలో హోటళ్ల ప్రారంభం
- పర్యాటక రంగానికి పూర్వస్థితిని తీసుకువస్తామన్న అవంతి
- లాక్ డౌన్ వల్ల నెలకు రూ.10 కోట్ల మేర నష్టం వస్తోందన్న మంత్రి
లాక్ డౌన్ కారణంగా రాష్ట్రంలో హోటళ్లు మూతపడ్డాయని, పర్యాటక కార్యకలాపాలు నిలిచిపోయాయని ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. పూర్వ స్థితిని తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని, జూన్ 8 నుంచి హోటళ్లు, పర్యాటక రంగ కార్యకలాపాలు ప్రారంభిస్తామని వెల్లడించారు. కేంద్ర నిబంధనలు, మార్గదర్శకాలు అనుసరిస్తామని స్పష్టం చేశారు. పర్యాటక శాఖకు చెందిన హోటళ్లు ఆన్ లైన్ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చని అన్నారు. టూరిస్టులకు థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు చేయాలని, శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని అధికారులకు స్పష్టం చేశారు.
రాష్ట్రానికి తీర, అటవీప్రాంతాలు, హిల్ స్టేషన్ల వంటి ప్రత్యేకతలు ఉన్నాయని తెలిపారు. రాష్ట్రానికి రివర్, టెంపుల్ టూరిజం వంటి విశిష్టతలు ఉన్నాయని, పర్యాటక రంగానికి పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేస్తామని, పర్యాటక విభాగాన్ని ఆదాయం తెచ్చే శాఖగా మార్చుతామని చెప్పారు. లాక్ డౌన్ వేళ పర్యాటక శాఖ నెలకు రూ.10 కోట్ల మేర ఆదాయం కోల్పోయిందని అన్నారు. గండికోట, హార్సిలీహిల్స్, అరకు ప్రాంతాల్లో ఫైవ్ స్టార్, సెవెన్ స్టార్ హోటళ్లు నిర్మిస్తామని మంత్రి వెల్లడించారు.