George Floyd: జార్జ్ ఫ్లాయిడ్ మృతిపై బిల్ గేట్స్ భార్య మిలిండా స్పందన
- జార్జ్ ఫ్లాయిడ్ మృతితో అట్టుడుకుతున్న అమెరికా
- జాతి వివక్షను ప్రశ్నించాలన్న మిలిండా గేట్స్
- ఫ్లాయిడ్ మృతి వీడియో చూసి గుండె బద్దలయిందని వ్యాఖ్య
నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మృతితో అమెరికా అగ్నిగుండంలా రగులుతోంది. దేశంలోని అన్ని ప్రాంతాల్లో నల్లజాతీయులు ఆందోళనలకు దిగుతున్నారు. వీరికి పలువురు తెల్లజాతీయులు కూడా సంఘీభావం తెలుపుతున్నారు.
మరోపైపు ఈ ఆందోళనలు అమెరికాను దాటి ఇతర ప్రాంతాలకు కూడా విస్తరిస్తున్నాయి. లండన్ లాంటి నగరాల్లో కూడా ఫ్లాయిడ్ మృతి పట్ల నిరసనలు జరుగుతున్నాయి. తెల్లజాతీయుడైన ఓ పోలీసు ఫ్లాయిడ్ మెడను మోకాలితో గట్టిగా నొక్కి పట్టుకోవడంతో అతను చనిపోయిన సంగతి తెలిసిందే. దీనిపై హత్య కేసు నమోదైంది.
మరోవైపు, ఈ ఘటనపై ప్రపంచ కుబేరుల్లో ఒకరైన బిల్ గేట్స్ భార్య మిలిండా గేట్స్ స్పందించారు. నల్లజాతీయులపై వివక్షను ప్రశ్నించకుండా వదిలేయకూడదని ఆమె అన్నారు. జార్జ్ ఫ్లాయిడ్ మృతి వీడియో చూసి తన గుండె బద్దలయిందని చెప్పారు. నిరసనకారులకు సంఘీభావం తెలుపుతున్నానని అన్నారు. లింగ, జాతి సమానత్వం కోసం పోరాడే సంస్థలు, ప్రజలతో చేయి కలిపి నడుస్తానని చెప్పారు.