Asaduddin Owaisi: విదేశీ సరుకును మనం ఎలా నిషేధించాలో కాస్త వివరంగా చెప్పు!: అమిత్ షాను ప్రశ్నించిన అసదుద్దీన్ ఒవైసీ
- విదేశీ వస్తు నిషేధంతో దేశ ఆర్థికరంగం పురోగమిస్తుందన్న షా
- అనేక రంగాల్లో ఎఫ్ డీఐలకు అనుమతించారన్న ఒవైసీ
- కీలక రంగాల్లో విదేశాల నుంచి దిగుమతులే ఎక్కువని వివరణ
దేశంలో ఉన్న 130 కోట్ల జనాభాయే భారత్ బలమని, వారంతా విదేశీ వస్తువులను కొనకూడదని నిర్ణయించుకుంటే దేశ ఆర్థిక వ్యవస్థ ఒక్కదుటున పైకి ఎగబాకుతుందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పేర్కొనడం తెలిసిందే. దీనిపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. 'బాబూ అమిత్ షా... విదేశీ వస్తువులను మనం ఏ విధంగా బహిష్కరించగలమో ఓసారి విడమర్చి చెప్పు' అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు.
"మీరు అనేక రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ద్వారాలు తెరిచారు. మొబైల్ ఫోన్ల తయారీ పరిశ్రమల్లో 88 శాతం విడిభాగాలు విదేశాల నుంచే దిగుమతి అవుతున్నాయి. భారత ఔషధ తయారీదార్లు 70 శాతం బల్క్ డ్రగ్స్ ను చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. అంతెందుకు దేశంలోని 60 శాతం వైద్య పరికరాలు దిగుమతి చేసుకున్నవే... ఇవన్నీ ఇలావుంటే ఏ విధంగా విదేశీ వస్తువులను నిషేధించాలి?" అంటూ సూటిగా ప్రశ్నించారు.