Stand Hog: గూగుల్ ఆండ్రాయిడ్ లో స్టాండ్ హాగ్ 2.0... ఈ బగ్ తో జాగ్రత్త అంటున్న కేంద్రం
- ఆండ్రాయిడ్ యూజర్లకు సరికొత్త ముప్పు
- పాత ఓఎస్ వాడుతున్న వారికి బగ్ తో ప్రమాదం
- వ్యక్తిగత సమాచారం హ్యాకర్ల పరమయ్యే అవకాశం
గూగుల్ ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. గూగుల్ ఆండ్రాయిడ్ పాత వెర్షన్లలో స్టాండ్ హాగ్ 2.0 అనే బగ్ ఉందని, దీని కారణంగా హ్యాకింగ్ కు గురయ్యే ముప్పు ఎక్కువని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సెర్ట్ (ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్) టీమ్ వెల్లడించింది. తమ స్మార్ట్ ఫోన్లలో ఇంకా పాత ఆపరేటింగ్ సిస్టమ్ (ఓఎస్) వాడుతున్న వారికి స్టాండ్ హాగ్ తో ముప్పు ఎక్కువని సెర్ట్ వివరించింది. ఆండ్రాయిడ్ 10, లేదా ఆపై వెర్షన్లకు వెంటనే అప్ డేట్ చేసుకోవాలని సూచించింది. లేకపోతే, వ్యక్తిగత సమాచారం హ్యాకర్ల పరమయ్యే అవకాశాలు ఎక్కువని హెచ్చరించింది.
ఫోన్ లోని సిస్టమ్ అప్ డేట్ ఆప్షన్ లోకి వెళ్లి లేటెస్ట్ వెర్షన్ ఓఎస్ కు అప్ డేట్ చేసుకోవాలని సెర్ట్ నిపుణులు తెలిపారు. యాప్ లను కూడా నమ్మదగిన ప్రొవైడర్ల నుంచే డౌన్ లోడ్ చేసుకోవాలని, అనుమానాస్పద లింకులను తెరవకపోవడమే మేలని సూచించారు. ఇప్పుడు వస్తున్న అన్ని ఫోన్లు ఆండ్రాయిడ్ 10 వెర్షన్ ను సపోర్ట్ చేస్తాయని, వెంటనే అప్ డేట్ చేసుకోవాలని స్పష్టం చేశారు.