Nawaz Sharif: లండన్ వీధుల్లో చక్కర్లు కొట్టిన నవాజ్ షరీఫ్.. అనారోగ్య కారణాలపై అనుమానాలు!
- అనారోగ్య కారణాలతో లండన్ లో ఉంటున్న షరీఫ్
- మనవరాళ్లతో కలిసి హోటల్ లో కనిపించిన వైనం
- విమర్శలు ఎక్కుపెడుతున్న వైరి పక్ష నేతలు
పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ అవినీతి ఆరోపణలతో జైలు శిక్షకు గురైన సంగతి విదితమే. అదే సమయంలో, అనారోగ్య కారణాలను చూపి, చికిత్స కోసం లండన్ వెళ్లారు. అయితే, లండన్ వీధుల్లో ఆయన చక్కర్లు కొడుతుండటం ఆయన అనారోగ్యంపై అనుమానాలను రేకెత్తిస్తోంది.
70 ఏళ్ల షరీఫ్ తన మనవరాళ్లతో కలసి లండన్ వీధుల్లో కనిపించారు. రోడ్డు పక్కనున్న ఓ హోటల్ లో టీ తాగుతూ కెమెరాకు చిక్కారు. మాస్క్ కూడా ధరించకుండా ఆయన కనిపించారు. ఈ ఫొటో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఆయన పూర్తి ఆరోగ్యంగాను ఉన్నారంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
షరీఫ్ ను చూస్తుంటే మన దేశంలో న్యాయ వ్యవస్థ తీరు ఎలా ఉందో అర్థమవుతుందని పాకిస్థాన్ శాస్త్ర, సాంకేతిక మంత్రి ఫవాద్ అహ్మద్ వ్యాఖ్యానించారు. షరీఫ్ అబద్ధాలు చెప్పి లండన్ కు వెళ్లిపోయారని పాక్ ప్రధాని సలహాదారు షహబాజ్ గిల్ తెలిపారు. పాక్ ప్రజలను మూర్ఖులుగా షరీఫ్ భావిస్తున్నారని విమర్శించారు. వెంటనే పాకిస్థాన్ కు తిరిగి వచ్చి అవినీతి ఆరోపణల కేసులో విచారణకు సహకరించాాలని డిమాండ్ చేశారు.
దీనిపై షరీఫ్ కుమార్తె మరియం నవాజ్ మాట్లాడుతూ, ఉద్దేశపూర్వకంగానే ఆ ఫొటోను కొందరు విడుదల చేశారని చెప్పారు. తన తండ్రి తీవ్ర గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్టు వైద్య పరీక్షల్లో తేలిందని అన్నారు. అయితే కరోనా కారణంగా ఆపరేషన్ వాయిదా పడిందని చెప్పారు.