Gautam Sawang: ఏపీకి రావాలంటే అనుమతి తప్పనిసరి: డీజీపీ గౌతమ్ సవాంగ్
- ప్రయాణానికి ఈ-పాస్ తప్పనిసరి
- వారం రోజుల హోమ్ క్వారంటైన్ తప్పనిసరి
- కరోనా టెస్ట్ కూడా చేయించుకోవాలన్న గౌతమ్ సవాంగ్
ఆంధ్రప్రదేశ్ లోకి ఇతర రాష్ట్రాల నుంచి రావాలంటే, ప్రస్తుతానికి ఈ-పాస్ తప్పనిసరని డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. రాష్ట్రాల మధ్య రాకపోకలపై కేంద్రం సడలింపులను ప్రకటించినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించేంత వరకూ నిబంధనలను కొనసాగిస్తామని ఆయన తెలిపారు.
ఈ మేరకు ఏపీ పోలీస్ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆయన, కరోనా కేసులు అధికంగా ఉన్న రాష్ట్రాల నుంచి వచ్చే వారికి కరోనా పరీక్షలు తప్పనిసరని, ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్ లో వారు ఉండాలనే, పరీక్షల్లో నెగటివ్ వస్తే, వారం రోజుల హోమ్ క్వారంటైన్ లో ఉండాలని, పాజిటివ్ వస్తే, ఆసుపత్రికి తరలిస్తామని తెలిపారు.
ఇక కేసులు తక్కువగా ఉన్న రాష్ట్రాల నుంచి వచ్చే వారు వారం రోజుల హోమ్ క్వారంటైన్ లో ఉండాలని తెలిపారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చేంత వరకూ సరిహద్దుల వద్ద ఆంక్షలు కొనసాగుతాయని, ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని గౌతమ్ సవాంగ్ కోరారు.