Bejan Daruwala: కరోనాతో కన్నుమూసిన సెలెబ్రిటీ జ్యోతిష్యుడు
- కరోనా మహమ్మారికి బలైన బేజన్ దారూవాలా
- ఇటీవలే కరోనా బారినపడిన దారూవాలా
- కొన్నిరోజులుగా వెంటిలేటర్ పై చికిత్స
భారత్ లో సెలబ్రిటీ హోదా అందుకున్న జ్యోతిష్యుల్లో బేజన్ దారూవాలా అగ్రగణ్యుడు. ఆయన కరోనా కారణంగా కన్నుమూశారు. తన జ్యోతిషంతో దేశవ్యాప్తంగా లక్షల మందిని ప్రభావితం చేసిన దారూవాలా చివరికి కరోనా మహమ్మారికి బలయ్యారు. ఆయన వయసు 90 ఏళ్లు.
ఇటీవలే ఆయన కరోనా పాజిటివ్ రావడంతో అహ్మదాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చేరారు. కొన్నిరోజులుగా దారూవాలాకు వైద్యులు వెంటిలేటర్ పైనే చికిత్స అందిస్తున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో నేడు తుదిశ్వాస విడిచారు.
బేజన్ దారూవాలా సెలబ్రిటీలకు జ్యోతిషం చెప్పడమే కాదు, జాతీయస్థాయిలో అనేక పత్రికల్లో ఆస్ట్రాలజీ కాలమిస్టుగానూ కొనసాగారు. 'గణేశా స్పీక్స్' అనే శీర్షికతో ఆయన జ్యోతిష శాస్త్ర విషయాలను పాఠకులతో పంచుకునేవారు. ఆయన మొరార్జీ దేశాయ్, వాజ్ పేయి, నరేంద్ర మోదీ వంటి వారు ప్రధాని అవుతారని ముందుగానే చెప్పారు. అంతేకాదు, రాజీవ్ గాంధీ హత్య, సంజయ్ గాంధీ ప్రమాదం, భోపాల్ గ్యాస్ దుర్ఘటనను సైతం ముందుగానే చెప్పినట్టు తెలుస్తోంది.