Sadguru: ఏది మంచి రోజు, ఏది చెడ్డరోజు... పీవీ సింధుకు విడమర్చి చెప్పిన సద్గురు
- పీవీ సింధు ప్రశ్నలకు సద్గురు జవాబులు
- మంచి పని చేస్తే ఏరోజైనా మంచి రోజేనన్న సద్గురు
- నక్షత్రాలు మనుషులపై ప్రభావం చూపవంటూ వివరణ
లైఫ్, లైఫ్ స్టైల్, స్పోర్ట్స్ అనే టాపిక్ పై జరిగిన చర్చలో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త సద్గురు జగ్గీవాసుదేవ్ స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. కొందరు మంగళవారం చెడ్డదని, సోమవారం మంచిదని అంటుంటారని, దీనిపై మీరేమంటారని పీవీ సింధు అడిగింది. దీనికి సద్గురు బదులిస్తూ, మంచి పనులు చేస్తే ఏ రోజైనా మంచి రోజేనని వెల్లడించారు. చాలామంది ప్రజలు అకస్మాత్తుగా.. లభించిన అవకాశాల వల్ల విజయాలు సాధిస్తుంటారని, అలాంటి వారికి ఫెయిల్యూర్ భయం వెంటాడుతూ ఉంటుందని.. వారే.. మంచి రోజు, చెడు రోజు అని చూస్తుంటారని చెప్పారు. యోగ్యత వలన విజయం సాధించిన వారు అవేమి పట్టించుకోరని తెలిపారు.
కొందరు వారి తల్లిదండ్రుల అండతో ఎదగవచ్చని, కొందరు డబ్బుతో ఎదగవచ్చని తెలిపారు. ఒకవేళ యోగ్యత కారణంగానే ఎదిగితే అండ, డబ్బు వంటి అంశాలవైపు చూడాల్సిన పనేలేదని సెలవిచ్చారు. "ఒక మ్యాచ్ ఓడిపోతే మరొకటి గెలవవచ్చు. కానీ కొందరు నక్షత్ర బలాన్ని నమ్ముతుంటారు. వారందరికీ చెప్పేది ఒక్కటే. ఇవాళ మీరు చూస్తున్న నక్షత్రాలు వాస్తవానికి ఎప్పుడో అంతర్థానమై పోయి ఉండవచ్చు. కొన్ని కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నందున అవి అంతర్థానమైపోయిన సంగతి మనకు తెలిసే సరికి చాలా సమయం పడుతుంది. అలాంటి నక్షత్రాలు మానవుల పరిస్థితిపై ప్రభావం చూపిస్తాయా?" అంటూ తత్వబోధ చేశారు.