Balakrishna: మీరేం కింగ్ కాదు.. ఒక హీరో మాత్రమే: బాలకృష్ణపై నాగబాబు తీవ్ర వ్యాఖ్యలు

Balakrishna is not a king says Nagababu

  • భూములు పంచుకునేందుకు వెళ్లారా అంటూ బాలయ్య వ్యాఖ్యలు
  • ఇండస్ట్రీ సమస్యలను చర్చించేందుకే భేటీ జరిగిందన్న నాగబాబు
  • బాలయ్య క్షమాపణలు చెప్పాలని డిమాండ్

తెలంగాణ ప్రభుత్వంతో సినీ పరిశ్రమ పెద్దలు జరిపిన చర్చలకు సంబంధించి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మంత్రి తలసానితో కలిసి భూములు పంచుకునేందుకు ఇండస్ట్రీ సీనియర్లు వెళ్లారా? అంటూ బాలకృష్ణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై మెగా బ్రదర్ నాగబాబు మండిపడ్డారు. బాలకృష్ణ వ్యాఖ్యలు చాలా దారుణంగా ఉన్నాయని... ఆయన తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సినీ పరిశ్రమకు చెందిన వారినే కాకుండా తెలంగాణ ప్రభుత్వాన్ని సైతం కించపరిచేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయిని మండిపడ్డారు.

తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో చిరంజీవి ఇంట్లో సినీ పెద్దలు భేటీ అయ్యారని నాగబాబు చెప్పారు. షూటింగ్ లను ఎలా ప్రారంభించాలనే దానిపై చర్చించారని తెలిపారు. అయితే చిరంజీవి ఇంట్లో కలుద్దామని మంత్రి చెప్పారా? లేదా? అనే విషయం తనకు తెలియదని అన్నారు. మీటింగ్ కు తనను పిలవలేదని బాలకృష్ణ చెప్పడంలో తప్పులేదని... అయితే భూములు పంచుకుంటున్నారని ఆరోపించడం దారుణమని చెప్పారు. ఆ తర్వాత ఏదో బూతు మాట కూడా మాట్లాడినట్టున్నారని... మీడియాలో దాన్ని బీప్ చేశారని అన్నారు.  

కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల బాలకృష్ణను మీటింగ్ కు పిలిచి ఉండకపోవచ్చని... అయితే, భూములను పంచుకున్నారంటూ చేసిన వ్యాఖ్యలు ఒక నిర్మాతగా, నటుడిగా తనకు బాధను కలిగించాయని నాగబాబు ఆవేదన వ్యక్తం చేశారు. నోటికి వచ్చినంత మాట్లాడటం సరికాదని, ఈ మాటలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాగే మాట్లాడతానని అంటే... అంతకు పది రెట్లు మాట్లాడేవారు ఇక్కడ ఉన్నారని చెప్పారు. ఇండస్ట్రీ బాగు కోసమే వెళ్లారు కానీ, భూములు పంచుకోవడానికి కాదు బాలకృష్ణగారూ అని అన్నారు. ఇండస్ట్రీకి మీరేం కింగ్ కాదు... మీరు కూడా ఒక హీరో మాత్రమే అని మండిపడ్డారు.

Balakrishna
Nagababu
Talasani
Tollywood
  • Error fetching data: Network response was not ok

More Telugu News