Chiranjeevi: మా సమీప బంధువు చనిపోవడంతో ఈ కార్యక్రమానికి రాలేకపోయాను: చిరంజీవి
- 14 వేల మంది సినీ, టీవీ కార్మికులకు తలసాని సాయం
- కార్యక్రమ ప్రారంభోత్సవానికి రాలేకపోయానన్న చిరంజీవి
- మంత్రికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపిన వైనం
టాలీవుడ్ సీనియర్ హీరో చిరంజీవి సోషల్ మీడియాలో ఓ వీడియో సందేశం రిలీజ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు 14 వేల మంది సినీ, టీవీ కార్మికులకు నిత్యావసరాలు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించడం హర్షణీయమని అన్నారు. అయితే, తమ సమీప బంధువు మరణించడంతో ఈ కార్యక్రమానికి తాను హాజరు కాలేకపోయానని చిరంజీవి వివరణ ఇచ్చారు. ఇంతటి బృహత్తర కార్యక్రమాన్ని చేపడుతున్న మంత్రి తలసాని నిజంగా అభినందనీయుడని తెలిపారు.
లాక్ డౌన్ ప్రారంభించాక సినీ కార్మికులకు తాము సీసీసీ ద్వారా సాయం చేశామని, ఇప్పుడు తలసాని సేవా ట్రస్ట్ ద్వారా మంత్రి తలసాని కార్యక్రమాలు చేపడుతున్నారని, అందుకు తామెంతో సంతోషిస్తున్నామని చిరు వెల్లడించారు. కేవలం సినీ రంగంలోని వాళ్లకే కాకుండా, టెలివిజన్ రంగంలోని కార్మికులను కూడా ఆదుకునేందుకు ఆయన ముందుకు రావడం గొప్ప విషయం అని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి తలసానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నట్టు చెప్పారు. అంతేకాకుండా, అటు ప్రభుత్వానికి, చిత్ర పరిశ్రమకు మధ్య సంధానకర్తగా ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారంటూ కొనియాడారు.