Aarogyasetu: 'హిట్ హబ్'లో ఆరోగ్య సేతు యాప్ సోర్స్ కోడ్!
- డెవలపర్ల సమీక్షకు సోర్స్ కోడ్ విడుదల
- రెండు వారాల్లో ఐఓఎస్ యాప్ కోడ్ కూడా అందుబాటులోకి
- సమాచార సాంకేతిక శాఖ కార్యదర్శి అజయ్ ప్రకాశ్ స్వాహ్నే
కరోనా వైరస్ పై సమగ్ర సమాచారాన్ని, కరోనా రోగులు, కంటెయిన్ మెంట్ జోన్ కు ఎంత దూరంలో ఉన్నారన్న విషయాన్ని ఎప్పటికప్పుడు తెలియజేసేలా కేంద్ర ప్రభుత్వం తయారు చేసిన ఆరోగ్య సేతు యాప్ సోర్స్ కోడ్ ను అధికారులు విడుదల చేశారు.
'హిట్ హబ్'లో ఆరోగ్య సేతు యాప్ సోర్స్ కోడ్ ఉందని, డెవలపర్లు దాన్ని సమీక్షించ వచ్చని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం ఆండ్రాయిడ్ కోడ్ అందుబాటులో ఉందని, మరో రెండు వారాల్లో సర్వర్ కోడ్ తో పాటు యాప్ ఐఓఎస్ వర్షన్ కోడ్ ను కూడా విడుదల చేస్తామని అధికారులు వెల్లడించారు.
కాగా, ఈ యాప్ ను ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, ఎన్ఐసీ సహకారంతో అధికారికంగా అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. యాప్ ఐఓఎస్, కాయ్ ఓఎస్ (జియో ఫోన్), ఐవీఆర్ఎస్ విధానంలోనూ అభివృద్ధి చేశారు. ఫీచర్ ఫోన్లు, ల్యాండ్ లైన్ ఫోన్లు వాడుతున్న వారు కూడా ఈ యాప్ ను వాడే అవకాశాన్ని దగ్గర చేశామని సమాచార సాంకేతిక శాఖ కార్యదర్శి అజయ్ ప్రకాశ్ స్వాహ్నే వ్యాఖ్యానించారు.
ఈ యాప్ ఎవరి ఫోన్ నంబర్ ను, పేరును స్టోర్ చేసుకోబోదని, మరొకరితో పంచుకోబోదన్న విషయాన్ని డెవలపర్లు సోర్స్ కోడ్ ను పరిశీలించి తెలుసుకోవచ్చని ఆయన అన్నారు. గత వారంలో ఆరోగ్య సేతు సర్వీస్ అండ్ ప్రైవసీ పాలసీని కూడా మార్చామని, యాప్ నిబంధనలను పాటించని యూజర్ ను సస్పెన్షన్ లో ఉంచబోదని ఆయన స్పష్టం చేశారు. ఏప్రిల్ లో ఈ యాప్ విడుదల కాగా, ఇప్పటివరకూ 11 కోట్ల మంది స్మార్ట్ ఫోన్ యూజర్లు డౌన్ లోడ్ చేసుకున్నారని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.