Vamsy Chandar Reddy: నీళ్లు ఆంధ్రా పాలు, నిధులు ఆంధ్రా కాంట్రాక్టర్ల పాలు, నియామకాలు కేసీఆర్ కుటుంబం పాలు: వంశీచంద్ రెడ్డి ఫైర్
- దక్షిణ తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందన్న కాంగ్రెస్ నేత
- దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులపై చర్చకు రావాలంటూ టీఆర్ఎస్ కు సవాల్
- టీఆర్ఎస్ నేతలు దద్దమ్మలంటూ ఘాటు వ్యాఖ్యలు
తెలంగాణ ఏర్పాటు తర్వాత దక్షిణ తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని ఏఐసీసీ కార్యదర్శి, తెలంగాణ కాంగ్రెస్ నేత వంశీచంద్ రెడ్డి ఆరోపించారు. రాయలసీమను రతనాల సీమగా చేయడానికి దక్షిణ తెలంగాణను ఎడారిగా మార్చుతారా? అంటూ మండిపడ్డారు. దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులపై టీఆర్ఎస్ చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు.
నీళ్లు ఆంధ్రా పాలు, నిధులు ఆంధ్రా కాంట్రాక్టర్ల పాలు, నియామకాలు కేసీఆర్ కుటుంబం పాలు అంటూ విమర్శించారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు సామర్థ్యం 44 వేల క్యూసెక్కులకు పెంచినప్పుడు అప్పటి క్యాబినెట్ లో టీఆర్ఎస్ కూడా ఉందని, నాడు క్యాబినెట్ నుంచి బయటికి వచ్చి ఎందుకు పోరాడలేదని వంశీచంద్ రెడ్డి ప్రశ్నించారు. అంతేకాకుండా, మహబూబ్ నగర్ జిల్లా టీఆర్ఎస్ నేతలు దద్దమ్మలు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.