Kanna Lakshminarayana: హిందూ ఆలయాల జోలికి రావద్దని చాలాసార్లు చెప్పాం: కన్నా లక్ష్మీ నారాయణ
- ఎన్నిసార్లు చెప్పినప్పటికీ ప్రభుత్వం వినిపించుకోలేదు
- ఆలయాల భూములపై ముందుకు వెళ్తోంది
- మంగళగిరి, అన్నవరంలోనూ భూములు తీసుకునే ప్రయత్నాలు
- మా ఆందోళనల వల్లే వెనక్కి తగ్గారు
తిరుమల శ్రీవారి ఆస్తులను అన్యాక్రాంతం చేసేందుకు టీటీడీ నిర్ణయాలు తీసుకుంటోందంటూ బీజేపీ ఏపీ నేతలు ఈ రోజు ఉపవాస దీక్షలకు దిగారు. టీటీడీ తీసుకున్న అనాలోచిత నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నామంటూ జనసేనతో కలిసి బీజేపీ నేతలు తమ ఇళ్ల వద్దే ఈ దీక్షలు ప్రారంభించారు. ఈ సందర్భంగా తన నివాసం నుంచి బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ మీడియాతో మాట్లాడారు.
హిందూ దేవాలయాల జోలికి రావద్దని తాము రాష్ట్ర ప్రభుత్వానికి చాలా సార్లు చెప్పామని కన్నా లక్ష్మీ నారాయణ అన్నారు. అయితే, తాము ఎన్నిసార్లు చెప్పినప్పటికీ ప్రభుత్వం వినిపించుకోకుండా ఆలయాల భూములపై ముందుకు వెళ్తోందని ఆయన విమర్శించారు. మంగళగిరి, అన్నవరంలో ఆలయ భూములు తీసుకునే ప్రయత్నాలు చేశారని వివరించారు. తాము చేస్తోన్న ఆందోళనల వల్లే ఇప్పటికే మంగళగిరి, అన్నవరం భూముల విషయంపై ప్రభుత్వం వెనక్కి తగ్గిందని ఆయన చెప్పారు.
ఇప్పుడు టీటీడీ భూములకే ఎసరు పెట్టారని ఆయన విమర్శించారు. ధార్మిక సంస్థలన్నీ ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించాయని ఆయన తెలిపారు. టీటీడీ చైర్మన్ మాత్రం భూముల అమ్మకానికి కేవలం రోడ్ మ్యాప్ ఇచ్చామంటూ వ్యాఖ్యలు చేశారన్నారు.
సుబ్బారెడ్డి గతంలో ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఆలయ భూముల పరిరక్షణపై చాలా మాట్లాడారని, ఇప్పుడు మాత్రం మరోలా ప్రవర్తిస్తున్నారని కన్నా లక్ష్మీ నారాయణ విమర్శలు గుప్పించారు. ఆలయాల ఆస్తుల పరిరక్షణ, హిందూ ధర్మ పరిరక్షణ కోసమే తాము ఉపవాస దీక్షలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.