Adilabad District: ఆదిలాబాద్‌లో పానీపూరి తిన్న 40 మంది చిన్నారులకు అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిక
- కాలనీలోకి వచ్చిన బండి వద్ద పానీపూరీ తిన్న చిన్నారులు
- బాధితులందరూ 10 ఏళ్ల లోపువారే
- ప్రాణాపాయం లేదన్న రిమ్స్ డైరెక్టర్
ఆదిలాబాద్‌లో పానీపూరీ తిన్న 40 మంది చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పానీపూరీ తిన్న వెంటనే వాంతులు, విరేచనాలు చేసుకోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు వెంటనే వారిని ‘రిమ్స్’కు తరలించారు. ఒకరి తర్వాత ఒకరిగా మొత్తం 40 మంది చిన్నారులు ఆసుపత్రికి రావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. రాత్రి 11 గంటల తర్వాత కూడా తల్లిదండ్రులు చిన్నారులను ఆసుపత్రికి తీసుకొస్తూనే ఉన్నారు. బాధితులందరూ ఐదు నుంచి పదేళ్లలోపు చిన్నారులే కావడం గమనార్హం.
నిన్న సాయంత్రం ఓ పానీపూరి తోపుడుబండి ఒకటి కాలనీలోకి వచ్చింది. పట్టణంలోని ఖుర్షీద్‌నగర్, సుందరయ్యనగర్‌కు చెందిన పలువురు చిన్నారులు ఆ బండివద్ద పానీపూరీ తిన్నారు. అయితే, రాత్రి 9 గంటల తర్వాత పానీపూరీ తిన్న చిన్నారులు ఒక్కొక్కరుగా వాంతులు, విరేచనాలు చేసుకుంటుండడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. వెంటనే వారిని రిమ్స్‌కు తరలించారు. మొత్తం 40 మంది చిన్నారులు ఆసుపత్రిలో చేరడంతో కలకలం రేగింది. కాగా, చిన్నారులకు ప్రాణాపాయం లేదని, అందరూ కోలుకుంటున్నారని రిమ్స్ డైరెక్టర్ బలరాం బానోత్ తెలిపారు.