KTR: ఐటీ ఎగుమతుల్లో మరోసారి సత్తా చాటిన తెలంగాణ.. కేటీఆర్ ను అభినందించిన కేసీఆర్!

IT Minister KTR tells about how Telangana IT Sector developed

  • ఐటీ రంగం అభివృద్ధిపై వివరాలు తెలిపిన మంత్రి కేటీఆర్
  • జాతీయ సగటు కంటే తెలంగాణ సగటు ఎక్కువని వెల్లడి
  • ఉద్యోగాల కల్పనలోనూ ముందంజలో ఉన్నామని వెల్లడి

తెలంగాణ అభివృద్ధి కొనసాగుతోందని ఐటీ మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. ఐటీ, ఐటీ ఆధారిత రంగాల్లో తెలంగాణ 2019-20 సంవత్సరానికి గాను 17.93 శాతం అభివృద్ధి నమోదు చేసిందని చెప్పడానికి ఆనందిస్తున్నామని తెలిపారు. జాతీయ సగటు కంటే తెలంగాణ అభివృద్ధి రేటు రెండింతలు ఎక్కువ అని వెల్లడించారు. 2019-20 సంవత్సరానికి గాను తెలంగాణ రూ.1,28,807 కోట్ల ఐటీ ఎగుమతులు నమోదు చేసిందని, 2018-19లో రూ,1,09,219 కోట్ల మేర ఐటీ ఎగుమతులు జరిగాయని వివరించారు.

ఇక ఐటీ రంగంలో ఉపాధి కల్పన విషయంలోనూ తెలంగాణ ముందంజలో ఉందని, జాతీయస్థాయిలో ఐటీ ఉద్యోగ కల్పన సగటు 4.93 శాతం కాగా, తెలంగాణలో 7.2 శాతానికి పెరిగిందని వెల్లడించారు. 2019-20 ఏడాదికి గాను అనేక కీలక పెట్టుబడులు హైదరాబాదు వచ్చాయని, వాటిలో అమెజాన్ అతిపెద్ద ప్రాంగణం కూడా ఉందని, మైక్రాన్ ఆర్ అండ్ డీ కేంద్రం ఉన్నాయని తెలిపారు. ఇక, టెక్ మహీంద్రా, సైయంట్ వంటి సంస్థలు వరంగల్ వంటి ద్వితీయ శ్రేణి నగరంలో కాలుమోపాలని నిర్ణయించుకున్నాయని పేర్కొన్నారు.

అభినందించిన ముఖ్యమంత్రి

ఐటీ వార్షిక నివేదికను ఈ రోజు మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రికి సమర్పించారు. ఐటీ ఎగుమతుల్లో తెలంగాణ వరుసగా ఐదోసారి కూడా మొదటి స్థానంలో నిలవడంతో మంత్రి కేటీఆర్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. ఓపక్క కరోనాతో కష్ట కాలం ఎదురైనప్పటికీ, రాష్ట్రం ఐటీ ఎగుమతుల్లో ప్రథమ స్థానంలో నిలిచినందుకు ముఖ్యమంత్రి సంతృప్తిని వ్యక్తం చేస్తూ, మంత్రిని ప్రశంసించారు.        

  • Loading...

More Telugu News