Pakistan: కరోనాతో పాక్ అధికార పార్టీ ఎమ్మెల్యే మృతి
- పంజాబ్ నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న షహీన్ రజా
- 17న ఆసుపత్రిలో చేరిక.. నేడు మృతి
- కేసులు పెరుగుతున్నా గేట్లు ఎత్తేసిన పాక్
పాకిస్థాన్‌లోని అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే షహీన్ రజా (65) కరోనా వైరస్ బారినపడి మరణించారు. పంజాబ్ నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న రజా లాహోర్‌లో కరోనాతో పోరాడుతూ మరణించినట్టు మాయో ఆసుపత్రి సీఈవో డాక్టర్ అసద్ అస్లాం తెలిపారు. కరోనా బారిన పడిన రజాను ఈ నెల 17న ఆసుపత్రిలో చేర్చగా, సోమవారం మాయో ఆసుపత్రికి తరలించారు. అక్కడామెకు పరీక్షలు నిర్వహించగా కోవిడ్ సోకినట్టు నిర్ధారణ అయిందని అస్లాం పేర్కొన్నారు.
ఇమ్రాన్ ఖాన్ పార్టీకి చెందిన రజా.. రిజర్వుడు సీటు నుంచి అసెంబ్లీకి ఎన్నికైనట్టు పంజాబ్ ఆరోగ్య మంత్రి యాస్మిన్ రషీద్ తెలిపారు. కేన్సర్ బారినపడి కోలుకున్న ఎమ్మెల్యే తరచూ ప్రావిన్స్‌లోని క్వారంటైన్ కేంద్రాలను సందర్శించేవారని ఆయన వివరించారు. కాగా, పాకిస్థాన్‌లో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ బుధవారం దేశాన్ని తెరిచారు. రెండు నెలల తర్వాత నేడు రైలు సర్వీసులు ప్రారంభమయ్యాయి. పాకిస్థాన్‌లో ఇప్పటి వరకు 45,898 మంది కరోనా బారినపడగా, 985 మంది మరణించారు.