Nepal: భారత్‌పై నేపాల్ ప్రధాని వివాదాస్పద వ్యాఖ్యలు
- చైనా, ఇటలీ వైరస్ కంటే భారత్ వైరస్ చాలా ప్రమాదకరమన్న నేపాల్ ప్రధాని
- నేపాల్‌లో కరోనా వ్యాప్తికి భారతే కారణమని నింద
- నేపాల్ వ్యాఖ్యల వెనక చైనా ఉందంటున్న నిపుణులు
భారత్-నేపాల్ మధ్య సరిహద్దు వివాదం నెలకొన్న ప్రస్తుత తరుణంలో నేపాల్ ప్రధాని కేపీ ఓలీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. పార్లమెంటులో ఆయన మాట్లాడుతూ.. చైనా, ఇటలీలోని కరోనా వైరస్ కన్నా భారత్‌లోని వైరస్ మరింత ప్రమాదకరంగా కనిపిస్తోందని ఆరోపించారు. వైరస్ తమ దేశంలో వ్యాపించడానికి భారతే కారణమన్నారు. భారత్‌లోని లిపులేఖ్, కాలపానీ, లింపియాధురా ప్రాంతాలు నేపాల్‌వేనని నిన్న పేర్కొన్న ప్రధాని ఓలీ.. రాజకీయ, దౌత్యపరమైన మార్గాల ద్వారా వాటిని స్వాధీనం చేసుకుంటామన్నారు.
భారత్ నుంచి అక్రమంగా నేపాల్‌లోకి వస్తున్న వారి వల్లే తమ దేశంలో వైరస్ వ్యాపిస్తోందని అన్నారు. బయటి నుంచి జనాలు వస్తుండడంతో వైరస్‌ను కట్టడి చేయడం కష్టతరంగా మారుతోందన్నారు. భారత్‌లోని వైరస్ చాలా ప్రమాదకరమైదని, ఎక్కువ మందికి వ్యాపిస్తోందని అన్నారు. చూస్తుంటే ఇది చైనా, ఇటలీ వైరస్ కంటే మరింత ప్రమాదకరంగా కనిపిస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాగా, నేపాల్ వ్యాఖ్యలు దురుద్దేశపూర్వకంగా ఉన్నాయని, నేపాల్‌తో చైనానే ఈ మాటలు అనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.