Devid Malpass: 6 కోట్ల మందిని కడు పేదరికంలోకి నెట్టనున్న మహమ్మారి: వరల్డ్ బ్యాంక్

World Bank Estimates Pandemic Will Push 60 Million Into Extreme Poverty

  • గత మూడేళ్లలో పేదరికంపై చేసిన పోరు వృథా
  • అభివృద్ధి చెందిన దేశాలు నిధులివ్వాలి
  • 160 బిలియన్ డాలర్లను సిద్ధం చేస్తున్నాం
  • ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు డేవిడ్ మల్ పాస్

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దాదాపు 6 కోట్ల మంది కడు పేదరికంలోకి నెట్టివేయబడనున్నారని ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు డేవిడ్ మాల్ పాస్ హెచ్చరించారు. గడచిన మూడు సంవత్సరాల వ్యవధిలో నమోదైన అభివృద్ధి ఫలాలన్నీ కరోనా కారణంగా మాయం కానున్నాయని ఆయన అంచనా వేశారు. ఇప్పటికే దాదాపు 100కు పైగా దేశాల్లో కరోనాపై పోరుకు రుణ సహాయాన్ని, వివిధ కార్యక్రమాలకు నిధులను ప్రపంచ బ్యాంక్ తరఫున అందిస్తున్నామని, వచ్చే 15 నెలల వ్యవధిలో 160 బిలియన్ డాలర్లను అందించనున్నామని ఆయన అన్నారు.

ఈ సంవత్సరం ప్రపంచ ఎకానమీ ఐదు శాతం మేరకు నష్టపోనుందని, దీని ప్రభావం పేద దేశాలపై అత్యంత కఠినంగా పడనుందని మల్ పాస్ వ్యాఖ్యానించారు. "మా అంచనాల ప్రకారం 6 కోట్ల మంది కడు పేదరికంలోకి జారిపోబోతున్నారు. పేదరిక నిర్మూలన నిమిత్తం గత మూడేళ్లలో పడిన శ్రమ వృథాకానుంది. మా అంచనాల ప్రకారం ఆర్థిక మాంద్యం ఎక్కువగా కనిపిస్తుంది" అని ఆయన పేర్కొన్నారు.

కాగా, 2019 చివర్లో వెలుగులోకి వచ్చిన కరోనా, ఇప్పటివరకూ 50 లక్షల మందికి సోకగా, 3 లక్షల మందికిపైగా మరణించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ వరల్డ్ బ్యాంక్ తరఫున 5.5 బిలియన్ డాలర్లను ఆరోగ్య సదుపాయాల కోసం, పేద దేశాల్లో ఆర్థిక, సామాజిక సేవల కోసం వరల్డ్ బ్యాంక్ వెచ్చించింది. కేవలం ఈ మాత్రం నిధులు కరోనాపై పోరుకు సరిపోవని అభిప్రాయపడ్డ మల్ ఫోస్, ధనిక దేశాల నుంచి ఎంతో సహాయం అవసరమని, అప్పుడే రికవరీ వేగంగా నమోదవుతుందని అన్నారు.

అభివృద్ధి చెందిన దేశాల నుంచి పర్యాటకుల ప్రయాణాలు ప్రారంభం కావాలని, ఆ దేశాల నుంచి పేద దేశాలకు మరింతగా నిధులు రావాల్సి వుందని, వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు లాక్ డౌన్ సడలింపులే మేలని మాల్ పాస్ తెలిపారు. కనీసం సంవత్సరం పాటు అన్ని రకాల రుణాలపై మారటోరియం విధించాల్సి వుందని అభివృద్ధి చెందుతున్న దేశాలకు సలహా ఇచ్చారు. ఇప్పటికే 14 దేశాలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయని, మరో 23 దేశాలు తమ సూచనలను పరిశీలిస్తున్నాయని అన్నారు.

  • Loading...

More Telugu News