Madhya Pradesh: నిబంధనలకు తూట్లు... ఆధ్యాత్మికవేత్త అంత్యక్రియలకు వేలాది మంది హాజరు.. వీడియో ఇదిగో!
- ఆధ్యాత్మికవేత్త దేవ్ ప్రభాకర్ శాస్త్రి మృతి
- మధ్యప్రదేశ్ లోని కత్ని జిల్లాలో అంత్యక్రియలు
- హాజరైన వారిలో బీజేపీ, కాంగ్రెస్ నేతలు
లాక్ డౌన్ నిబంధనలను, స్ఫూర్తిని వదిలేసి అంత్యక్రియలకు వేలాది మంది హాజరైన ఘటన మధ్యప్రదేశ్ లోని కత్ని జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దేవ్ ప్రభాకర్ శాస్త్రి (82) ఊపిరితిత్తులు, కిడ్నీ సమస్యలతో గత ఆదివారం తుదిశ్వాస విడిచారు.
ఢిల్లీలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో, ఆయనను సినీ నటుడు అశుతోశ్ రాణా, రాష్ట్ర మాజీ మంత్రి సంజయ్ పాథక్ మధ్యప్రదేశ్ కు తీసుకొచ్చారు. అనంతరం ఆయన మృతి చెందారు. దేవ్ ప్రభాకర్ శాస్త్రి అంత్యక్రియలకు వేలాది మంది తరలివచ్చారు. లాక్ డౌన్ నిబంధనలను ఎవరూ పట్టించుకోలేదు.
ఆయనకు నివాళి అర్పించిన వారిలో ముఖ్యమంత్రి శివ్ రాజ్ సింగ్ చౌహాన్, బీజేపీ జాతీయ జనరల్ సెక్రటరీ కాలాశ్ విజయవర్గీయ, మధ్య ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్, మరో మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ తదితరులు ఉన్నారు. భారీ ఎత్తున జనాలు హాజరుకావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ నిబంధనల మేరకు అంత్యక్రియలకు 20 మందికి మించి హాజరుకాకూడదు.
మరో వైపు ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, నిబంధనల ఉల్లంఘన జరగలేదని చెప్పారు. హాజరైన వారు సోషల్ డిస్టెన్స్ పాటించారని తెలిపారు.