Hyderabad: ఉన్న సీట్ల వరకే ప్రయాణికులు... టీఎస్ఆర్టీసీ నిబంధనలివే!

These are the TSRTC Buses Conditions

  • సంఖ్యను తగ్గిస్తే చార్జీలను పెంచాలి
  • నిబంధనలు పాటిస్తూ ప్రయాణాలు
  • హైదరాబాద్ శివార్ల వరకే జిల్లాల బస్సులు
  • స్పష్టం చేసిన కేసీఆర్

తెలంగాణలో నేటి నుంచి ఆర్టీసీ బస్సులు తిరుగుతాయని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్.. అందుకు సంబంధించిన నియమ నిబంధనలను కూడా వెల్లడించారు. నిలబడి ప్రయాణాలు, ఫుట్‌బోర్డు ప్రయాణాలు ఉండబోవని, బస్సు ఎక్కే వారంతా కొవిడ్‌-19 నిబంధనలు పాటించాల్సిందేనని తెలిపారు. బస్సుల్లో పాత చార్జీలే వసూలు చేస్తామని, ప్రయాణికులపై ఎలాంటి అదనపు భారం పడకుండా ఉండేలా చూడటమే తమ ఉద్దేశమని తెలిపారు.

 రాత్రి 7 గంటల వరకే ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంటాయని అన్నారు. రాత్రి 7 గంటలకల్లా ఎక్కడి బస్సులు అక్కడే నిలిచిపోతాయని, ప్రస్తుతానికి అంతర్రాష్ట్ర సర్వీసులకు అనుమతి ఇవ్వడం లేదని అన్నారు. జిల్లాల నుంచి వచ్చే బస్సులను హైదరాబాద్‌ శివార్ల వరకు మాత్రమే అనుమతిస్తామని తెలిపారు. అన్ని బస్సుల్లో శానిటైజేషన్‌ తప్పనిసరి చేశామని తెలిపారు.

50 శాతం సీట్లతో నడిపితే చార్జీలను పెంచాల్సిందేనని అధికారులు స్పష్టం చేయడంతో,  వున్న సీట్ల వరకూ ప్రయాణికులను అనుమతించాలని నిర్ణయించామని కేసీఆర్ తెలిపారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలదే తుది నిర్ణయమని కేంద్రం పేర్కొందని గుర్తు చేశారు. హైదరాబాద్ పరిధిలోని డిపోల బస్సులు కదలవని, మిగతా జిల్లాల్లోని డిపోల నుంచి మాత్రమే బస్సులు నడుస్తాయని అన్నారు.

ప్రయాణికులకు మాస్క్ తప్పనిసరని వెల్లడించిన కేసీఆర్, మొత్తం 10,460 బస్సుల్లో దాదాపు 6 వేల బస్సులు మాత్రమే రోడ్లపైకి వస్తాయని తెలిపారు. హైదరాబాద్ కు వచ్చే బస్సులను సరిహద్దుల వరకూ మాత్రమే నడిపిస్తామని అన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, మెదక్‌ జిల్లాల నుంచి వచ్చే బస్సులు జేబీఎస్‌ వరకూ వస్తాయని అన్నారు.

ఇక సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి-భువనగిరి జిల్లాల నుంచి వచ్చే బస్సులను హయత్‌నగర్‌ వరకు అనుమతిస్తామని, వరంగల్, జయశంకర్‌-భూపాలపల్లి, ములుగు, జనగాం జిల్లాల నుంచి, భువనగిరి నుంచి వచ్చే బస్సులకు ఉప్పల్‌ వరకు మాత్రమే అనుమతి ఉంటుందని అన్నారు. ఉమ్మడి మహబూబ్‌ నగర్ ప్రాంతాల‌ నుంచి వచ్చే ప్రయాణికులను ఆరాంఘర్‌ చౌరస్తా వద్ద దించేస్తారని స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రయాణికులు సహకరించాలని కోరారు.

Hyderabad
TSRTC
KCR
Buses
  • Loading...

More Telugu News