CPI Ramakrishna: విజయవాడలో సీపీఐ రామకృష్ణను అదుపులోకి తీసుకున్న పోలీసులు

CPI Ramakrishna arrested in Vijayawada
  • పెరిగిన విద్యుత్ ఛార్జీలపై వామపక్షాల నిరసన
  • నిరసనలు, ధర్నాలకు అనుమతి లేదన్న పోలీసులు
  • ఆగ్రహం వ్యక్తం చేసిన రామకృష్ణ
సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెరిగిన విద్యుత్ ఛార్జీలను నిరసిస్తూ విజయవాడ బందర్ రోడ్డులోని రంగా సెంటర్ వద్ద సీపీఐ, సీపీఎం పార్టీలు ధర్నా చేపట్టాయి. అయితే, ఈ నిరసన కార్యక్రమానికి పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. విజయవాడలో సెక్షన్ 30, 40 అమల్లో వున్నాయని... ముందస్తు అనుమతులు లేని నిరసనలు, ధర్నాలు నిషేధమని  చెప్పారు. ధర్నా చేస్తున్న వామపక్ష నేతలు, కార్యకర్తలను అదుపులోకి తీసుకుని, అక్కడి నుంచి తరలించారు.

ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ, ఇప్పటికే కరోనా కారణంగా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని... ఈ సమయంలో కరెంట్ ఛార్జీలను పెంచడం దారుణమని అన్నారు. మంత్రులు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని... ఛార్జీలు పెంచలేదని చెబుతున్న బుగ్గన బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. తాము శాంతియుతంగా నిరసన కార్యక్రమాలను చేపడుతున్నా అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత కూడా పెరిగిన విద్యుత్ ఛార్జీలపై పోరాటం కొనసాగుతుందని చెప్పారు.
CPI Ramakrishna
Electricity charges
Protest
Vijayawada

More Telugu News