China: చైనీయుల్లో తక్కువ రోగ నిరోధక శక్తి... మరోసారి కరోనా ముప్పు తప్పదంటున్న నిపుణులు
- కరోనా కేంద్రస్థానంగా చైనా
- చైనాలో మళ్లీ నమోదవుతున్న కేసులు
- చైనా అతి పెద్ద సవాల్ ను ఎదుర్కోంటోందన్న నిపుణులు
చైనాకు చెందిన వైద్య, ఆరోగ్య నిపుణులు కరోనా నేపథ్యంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చైనీయుల్లో సహజంగానే వ్యాధి నిరోధక శక్తి తక్కువని, దాంతో కరోనా వైరస్ మరోసారి విజృంభించే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రముఖ వైద్య నిపుణుడు డాక్టర్ జోంగ్ నాన్ షాన్ స్పందిస్తూ, తక్కువ వ్యాధి నిరోధక శక్తి కారణంగా చైనీయులు మళ్లీ కరోనా బారినపడే అవకాశాలు ఎక్కువని అన్నారు. చైనాలో కరోనా తీవ్రత తగ్గిందని ప్రభుత్వ నివేదికలు చెబుతుండగా, కొన్నిరోజులుగా కొత్త కేసులు నమోదువుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. కరోనాకు జన్మస్థానంలా నిలిచిన వుహాన్ నగరంలోనూ కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి.
ప్రస్తుతం చైనా అతిపెద్ద సవాల్ ఎదుర్కొంటోందని, విదేశాలతో పోల్చితే ఇది మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని జోంగ్ నాన్ షాన్ తెలిపారు. చైనీయుల్లో కరోనాను ఎదుర్కొనే రోగ నిరోధక శక్తి లేదని, మరోసారి పెను ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో అధికారులు ఆదమరిచి వ్యవహరించరాదని స్పష్టం చేశారు.