Corona Virus: 'కరోనా' నేపథ్యంలో ఏకంగా 211 మంది భారత ప్రసిద్ధ గాయకులు 14 భాషల్లో పాడిన పాట ఇది!
- కరోనా పోరాటయోధులకు సంఘీభావం
- పాడిన ఆశాభోంస్లే, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, హరిహరన్
- కైలాశ్ ఖేర్, శంకర్ మహదేవన్, ఉదిత్ నారాయణ్ తదితరులు
- ప్రతి భారతీయుడికి అంకితమన్న ఆశా బోంస్లే
కరోనా విజృంభణ నేపథ్యంలో 211 మంది భారత గాయకులు ఓ పాట పాడారు. కరోనాపై పోరాటంలో ప్రజల్ని రక్షించేందుకు వైద్య సిబ్బంది త్యాగాలు చేస్తూ విధుల్లో పాల్గొంటోన్న విషయం తెలిసిందే. తమ ప్రాణాలకు ముప్పుందని తెలిసినా వారు విధులు నిర్వహిస్తున్నారు. వారితో పాటు కరోనా పోరులో పనిచేస్తోన్న వారికి సంఘీభావంగా గాయకులు ఈ పాట పాడారు.
'జయతు జయతు భారతం' గీతం కోసం దేశ వ్యాప్తంగా ఉన్న గాయకులు ఒక తాటిపైకి వచ్చి స్ఫూర్తిగా నిలిచారు. గాయకులు ఆశాభోంస్లే, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, హరిహరన్, కైలాశ్ ఖేర్, శంకర్ మహదేవన్, ఉదిత్ నారాయణ్ వంటి వారు ఇందులో పాల్గొన్నారు.
మొత్తం 14 భాషల్లో (హిందీ, బెంగాలీ, మరాఠీ, గుజరాతీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, భోజ్‌పురి, అస్సామీ, కశ్మీరీ, సింధీ, రాజస్థానీ, ఒడియా భాషల్లో ఈ పాట ఉంది. ఈ కష్ట సమయాల్లో కుటుంబంగా కలిసి నిలబడిన ప్రతి భారతీయుడికి సంఘీభావంగా 14 భాషల్లోని చారిత్రాత్మక గీతం అంకితం చేయబడిందని ప్రముఖ గాయని ఆశా భోంస్లే తెలిపారు.