poultry farm: ఆల్‌టైం హైకి చేరుకున్న చికెన్ ధర.. కొనాలంటే గుండె గుభేల్!

Chicken Rate record all time high

  • నేడు లిఫ్టింగ్ ధర రూ. 145గా నమోదు
  • కిలోకు రూ. 260 దాటే అవకాశం
  • తెలంగాణలో సగానికి పడిపోయిన కోళ్ల పెంపకం

ఈసారి చికెన్ ధరలు గుండెలు గుభేల్‌మనిపిస్తున్నాయి. ఈసారి కిలో చికెన్ ధర ఏకంగా రూ. 257కు చేరుకుంది. గతంలో ఏ వేసవిలోనూ ధరలు ఈ స్థాయికి చేరుకోలేదు. ఒక్కసారి మాత్రం రూ. 246కు చేరుకుంది. ఇప్పటి వరకు ఇదే అత్యధికం కాగా, ఈసారి ఆ రికార్డు బద్దలైంది. మొన్నటి వరకు కరోనా భయంతో కోడి మాంసాన్ని ముట్టని ప్రజలు ఇప్పుడు తిందామన్నా ధరలు చూసి వెనక్కి తగ్గే పరిస్థితి ఏర్పడింది.

చికెన్ తింటే కరోనా వస్తుందన్న పుకార్లతో ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో పౌల్ట్రీ పరిశ్రమ దారుణంగా నష్టపోయింది. ఫలితంగా తెలంగాణలో కోళ్ల పెంపకం 50 శాతానికి పడిపోయింది. మరోవైపు, ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతుండడంతో కోళ్లు తక్కువ బరువు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో చికెన్ ధరల పెరుగుదలకు ఇదే కారణమని పౌల్ట్రీ వ్యాపారులు చెబుతున్నారు.

నిన్న కోళ్ల ఫారాల వద్ద లిఫ్టింగ్ ధర రూ.140గా ఉండగా, నేడు అది రూ. 145కు చేరింది. ఈ లెక్కన చూసుకుంటే కిలో చికెన్ ధర రూ. 260 దాటే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ధర ఇంతగా పెరిగినా ఇప్పటి వరకు చవిచూసిన నష్టాలతో పోలిస్తే కోళ్ల రైతులకు దక్కేది అతి తక్కువేనని నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ (నెక్) పేర్కొంది.

లాక్‌డౌన్‌కు ముందు వరకు రాష్ట్రంలో ప్రతి నెలా నాలుగున్న కోట్ల కోడిపిల్లలను వేసేవారు. ప్రస్తుతం అది రెండు కోట్లకు పడిపోయింది. ప్రస్తుతం చికెన్ తినేవారి సంఖ్య పెరుగుతున్నా, రెస్టారెంట్లు, హోటళ్లు తెరవకపోవడంతో కోళ్ల పెంపకానికి రైతులు ముందుకు రావడం లేదని, హోటళ్లు, రెస్టారెంట్లు తెరిస్తేనే కోళ్ల పెంపకం తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటుందని ‘నెక్’ ఆశాభావం వ్యక్తం చేసింది.

poultry farm
Chicken
Telangana
  • Loading...

More Telugu News