Nirmala Sitharaman: రైతులు దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చు... జాతీయ చట్టం తీసుకువస్తాం: నిర్మలా సీతారామన్
- ఎక్కడ మంచి ధర లభిస్తే అక్కడ అమ్ముకోవచ్చని వెల్లడి
- అంతర్రాష్ట్ర వాణిజ్యానికి ప్రోత్సాహం
- లైసెన్స్ పొందిన వ్యాపారులకే విక్రయించాల్సిన అవసరం లేదని స్పష్టీకరణ
ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ పేరిట అనేక రంగాలపై కేంద్రం కరుణ చూపుతోంది. తాజాగా వ్యవసాయ రంగానికి ఊరట కలిగించే ప్రకటన చేశారు. వ్యవసాయ రంగ మౌలిక వసతుల కోసం లక్ష కోట్ల రూపాయలతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అంతర్రాష్ట్ర వ్యవసాయ వాణిజ్యాన్ని ప్రోత్సహిస్తామని, రైతులు ఏ రాష్ట్రంలోనైనా తమ ఉత్పత్తులు అమ్ముకోవచ్చన్నారు. దేశంలో ఎక్కడ మంచి ధర లభిస్తే అక్కడే తమ ఉత్పత్తులు విక్రయించుకోవచ్చని, అలాగే తమకు అనుకూల ధరకు కొనుగోళ్లు కూడా జరపవచ్చని ఈ మేరకు జాతీయస్థాయిలో ప్రత్యేక చట్టం తీసుకువస్తామని వివరించారు. లైసెన్స్ పొందిన వ్యాపారులకే విక్రయించాల్సిన అవసరం ఇక మీదట ఉండదని, వ్యవసాయ రంగ ఉత్పత్తుల అమ్మకాలు, కొనుగోళ్లపై పరిమితులు తొలగిస్తున్నామని చెప్పారు.