Bonda Uma: సీఎం గారూ... సామాన్యుల బైక్ లు విడిపించండి: బోండా ఉమ
- 60 రోజుల్లో లక్ష వాహనాలు సీజ్ చేశారు
- అత్యవసర పనులకు కూడా వెళ్లలేని పరిస్థితి నెలకొంది
- బైక్ లు తుప్పుపట్టి పోతున్నాయి
లాక్ డౌన్ నేపథ్యంలో రోడ్లపైకి వచ్చిన వాహనదారులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. వారి బైక్ లను సీజ్ చేసి, కేసులు నమోదు చేస్తున్నారు. ఈ అంశంపై టీడీపీ నేత బోండా ఉమ విమర్శలు గుప్పించారు. గత 60 రోజుల నుంచి సామాన్యుల వాహనాలను పోలీసులు సీజ్ చేస్తుండటం దారుణమని అన్నారు. లక్ష వాహనాలను సీజ్ చేశారని చెప్పారు. వాహనాలు కోల్పోయిన వారు అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రులకు కూడా వెళ్లలేని పరిస్థితి తలెత్తిందని అన్నారు.
మరోవైపు, పోలీసుల అధీనంలో ఉన్న బైక్ లు తుప్పుపట్టి పోతున్నాయని చెప్పారు. సీఎం గారూ... సామాన్యుల బైక్ లు విడిపించండి అని ట్వీట్ చేశారు. దీంతో పాటు సీజ్ చేసిన వాహనాలకు సంబంధించిన ఫొటోను షేర్ చేశారు.