Andhra Pradesh: 10వ తరగతి పరీక్షల నిర్వహణపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- జూలై 10 నుంచి పదో తరగతి పరీక్షలు
- 11 పేపర్లు 6కు కుదింపు
- ఒక్కో సబ్జెక్ట్ కు ఒక్కో పేపర్ మాత్రమే
లాక్ డౌన్ ప్రభావం విద్యారంగంపై తీవ్ర స్థాయిలో పడింది. దేశ వ్యాప్తంగా పాఠశాలలు, కాలేజీలు, యూనివర్శిటీలు అన్నీ మూతపడ్డాయి. పరీక్షలు కూడా ఆగిపోయాయి. ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు విద్యార్థులందరినీ ప్రమోట్ చేస్తున్నట్టు రెండు తెలుగు రాష్ట్రాలు ప్రకటించాయి. మరోవైపు తాజాగా ఏపీ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుంది. పదో తరగతికి నిర్వహించే 11 పేపర్లను 6కు కుదించింది. అంటే ఇప్పటి వరకు పదో తరగతిలో 11 పేపర్లను రాసిన విద్యార్థులు ఈ ఏడాది కేవలం 6 పేపర్లు మాత్రమే రాస్తారన్నమాట.
తెలుగు, ఇంగ్లీష్, హిందీ, గణితం, సైన్స్, సోషల్ సబ్జెక్టులకు సంబంధించి ఒక్కో పేపర్ మాత్రమే ఉంటుంది. మరోవైపు, జూలై 10 నుంచి 15వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలను నిర్వహించనున్నట్టు ఏపీ ప్రభుత్వం తెలిపింది. విద్యార్థుల ఆరోగ్య రక్షణకు అన్నివిధాలా కట్టుదిట్టమైన చర్యలను తీసుకోబోతున్నట్టు వెల్లడించింది. పరీక్షల నేపథ్యంలో విద్యార్థులు కానీ, తల్లిదండ్రులు కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పింది.