India: ఇతర దేశాల కరోనా ప్యాకేజీలతో పోలిస్తే.. భారత ప్యాకేజీ ఎంతవరకు సరిపోతుంది?

India Relief Package is Top 5 in World

  • జీడీపీలో 10 శాతానికి సమానమైన ప్యాకేజీ
  • జీడీపీలో వాటాతో పోలిస్తే టాప్-5లో భారత్
  • కేటాయించిన డబ్బు విలువలో మాత్రం 19వ స్థానంలో
  • తలసరి కేటాయింపులో ఇండియాకన్నా మెరుగ్గా ఎన్నో దేశాలు

కరోనాను మరింత సమర్థవంతంగా ఎదుర్కోవడంతో పాటు, ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు జీడీపీలో 10 శాతానికి సమానమైన రూ. 20 లక్షల కోట్ల విలువైన ఉద్దీపన ప్యాకేజీని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నిధితో స్వయం సమృద్ధిని సాధించేందుకు ప్రయత్నించాలని, అన్ని రంగాలనూ ఆదుకునే ప్రయత్నం చేస్తామని కూడా ఆయన స్పష్టం చేశారు. ప్రపంచదేశాలు ప్రకటించిన కొవిడ్ ప్యాకేజీలతో పోలిస్తే, ఇది తక్కువే. కొవిడ్ పై పోరుకు పలు దేశాలు ప్రకటించిన నిధులతో పోలిస్తే, ఐదో అత్యధిక మొత్తాన్ని ప్రకటించిన దేశంగా (జీడీపీలో వాటాతో పోలిస్తే) ఇండియా నిలిచింది.

ఇక, ఇప్పటివరకూ కొవిడ్-19పై ఇండియా వెచ్చించిన మొత్తం జీడీపీలో ఒక శాతానికన్నా తక్కువేనని నోబెల్ బహుమతి విజేత అభిజిత్ బెనర్జీ వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో ఆర్థికవేత్త చేహున్ ఎల్జిన్, కొవిడ్-19 ఎకనామిక్ స్టిములస్ ఇండెక్స్ (సీఈఎస్ఐ)ని రూపొందించారు. ఈ ఇండెక్స్ ప్రకారం, జీ-20 దేశాలు కరోనాపై పోరుకు వెచ్చించిన మొత్తాల్లో ఇండియా ఐదో స్థానంలో ఉంది.

ఈ జాబితాలో జపాన్ తొలి స్థానంలో నిలిచింది. జపాన్ తన జీడీపీలో 21.1 శాతానికి సమానమైన మొత్తాన్ని కరోనాపై పోరుకు వెచ్చించేందుకు నిర్ణయించింది. ఆ తరువాతి స్థానంలో నిలిచిన అమెరికా స్థూల జాతీయోత్పత్తిలో 13.3 శాతం, ఆస్ట్రేలియా 10.8 శాతం, జర్మనీ 10.7 శాతం ఉన్నాయి. ఇక కేటాయించిన డబ్బు విలువతో పోలిస్తే మాత్రం ఎల్గిన్ తయారు చేసిన జాబితాలో హాంకాంగ్ తో కలిపి భారత్ 19వ స్థానంలో నిలిచింది. చిన్న దేశాలైన లక్సెంబర్గ్, బెల్జియం వంటి దేశాలు భారత్ కన్నా అధికంగా ఖర్చుపెడుతున్నాయి.
 
వెచ్చిస్తున్న డబ్బు విలువను బట్టి చూస్తే, అమెరికా 2.7 ట్రిలియన్ డాలర్లను ఖర్చు చేస్తుండగా, ఇండియా మాత్రం 265 బిలియన్ డాలర్లకే పరిమితమైంది. జనాభా పరంగా అమెరికా కన్నా ఎంతో ముందున్న ఇండియాలో కరోనాపై పోరుకు తలసరి ఖర్చు అమెరికాతో పోలిస్తే చాలా తక్కువనే చెప్పాలి. జపాన్ ఇప్పటికే 1.1 ట్రిలియన్ డాలర్ల రికవరీ ప్యాకేజీని ప్రకటించి, అవసరమైతే మరింతగా వెచ్చిస్తామని తెలిపింది. జర్మనీ, ఇటలీలు సుమారు 750 బిలియన్ యూరోలను ప్యాకేజీగా ప్రకటించాయి. యూకే సైతం తక్షణ సాయంగా 100 బిలియన్ పౌండ్లను ప్రకటించింది. మొత్తం యూరోపియన్ యూనియన్ దేశాలు సంయుక్తంగా 3.5 ట్రిలియన్ డాలర్లు (3.2 ట్రిలియన్ యూరోలు) వెచ్చించేందుకు సిద్ధమయ్యాయి.

కెనడా సైతం భారీ ఆర్ధిక ప్యాకేజీని అమలు చేస్తోంది. పేద కుటుంబాలకు నెలకు 2500 డాలర్ల చొప్పున అందించాలని, ప్రతి చిన్నారికి 300 డాలర్లు అదనంగా ఇస్తామని, వృద్ధులుంటే, మరో 100 డాలర్లు ఇస్తామని తెలిపింది. దేశంలోని 90 లక్షల మంది లబ్దిదారులను గుర్తించింది. బ్రెజిల్‌ ఇప్పటికే ఎంఎస్ఎంఈ సంస్థలకు ఊతమిచ్చే నిర్ణయాలు తీసుకుని, 14.9 బిలియన్‌ డాలర్ల విలువైన సాయాన్ని అందించింది. స్థానిక సంస్థలు, రాష్ట్రాలకు 17.6 బిలియన్‌ డాలర్లను ప్రకటించింది. ప్రభుత్వం నుంచి ఆర్ధిక సాయం పొందే ఏ కంపెనీ కూడా ఉద్యోగులను తొలగించేందుకు వీల్లేదని స్పష్టం చేసింది. దేశంలోని ప్రతి కుటుంబానికి నిత్యావసరాల్ని ఉచితంగా సరఫరా చేయాలని కూడా నిర్ణయించింది.

దక్షిణాప్రికా ఇప్పటికే 800 బిలియన్ల ర్యాండ్స్‌ విలువైన ప్యాకేజీని ప్రకటించి, ఆర్థిక వ్యవస్థ మరింత పతనం కాకుండా నిరోధించాలని భావిస్తోంది. లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన కుటుంబాలకు 50 బిలియన్‌ ర్యాండ్లు ప్రకటించింది. ఉద్యోగుల్ని తొలగించకుండా ఉంటే, సదరు కంపెనీలకు 200 బిలియన్‌ ర్యాండ్ల ఆర్ధిక సాయాన్ని ఇస్తామని ఆకర్షణీయ ఆఫర్ ను ఇచ్చింది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తొలి నాళ్లలోనే అంటే, ఫిబ్రవరిలోనే 4 బిలియన్ డాలర్ల విలువైన ప్యాకేజీని ప్రకటించిన సింగపూర్, ఆపై దాన్ని 48.4 బిలియన్‌ డాలర్లకు పెంచింది. నిరుద్యోగులకు భృతితో పాటు, విమానయాన, ఆహార, ఉద్యోగుల పరిరక్షణకు అత్యధిక మొత్తాన్ని కేటాయించింది.

ఇక ఇండియా విషయానికి వస్తే, తొలుత కేంద్ర ప్రభుత్వం రూ. 1.7 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించగా, ఆపై ఆర్బీఐ రూ. 3.7 లక్షల కోట్లకు సమానమైన ఉద్దీపన నిర్ణయాలను తీసుకుంది. ఆ మొత్తాలతో కలిపి ప్రస్తుతం రూ. 20 లక్షల కోట్లకు ప్యాకేజీ విలువ పెరిగింది. సుమారు 130 కోట్ల మందికి పైగా జనాభాను కలిగివున్న భారత్ కు ఈ ప్యాకేజీ ఎలా ఉపకరిస్తుందన్న సందేహాలు నెలకొనివున్నాయి. ఈ రిలీఫ్ ప్యాకేజీని ఏఏ రంగాలకు ఎలా కేటాయిస్తారన్న అంశం ఇప్పుడు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రత్యక్ష నగదు బదిలీలు, పన్ను రాయితీలు, ద్రవ్య లభ్యత తదితరాలపై కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఆసక్తి నెలకొంది.

  • Loading...

More Telugu News